- హైదరాబాద్ సెగ్మెంట్లో 1,944 పోలింగ్ స్టేషన్లు
- 4, 862 బ్యాలెట్ యూనిట్లు(బీయూ) కేటాయింపు
- హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోక్ సభ సెగ్మెంట్ పరిధిలో పోలింగ్ కేంద్రాలకు రెండో విడత ఈవీఎంలను పారదర్శకంగా కేటాయించామని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోటీలో ఉన్న అభ్యర్థులు సమక్షంలో రెండో విడత ర్యాండమైజేషన్ ద్వారా ఈవీఎంలను కేటాయించారు.ఈ సందర్భంగా అనుదీప్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లోని పోలింగ్ కేంద్రాల వారీగా రెండో విడత ర్యాండమైజేషన్ ద్వారా బ్యాలెట్ యూనిట్లను కేటాయించామన్నారు.
30 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నందున ఒక్కో బ్యాలెట్ యూనిట్ లో 15 మంది, నోటాకు 2 బ్యాలెట్ యూనిట్లు అవసరమన్నారు. 1,944 పోలింగ్ కేంద్రాలకు అదనంగా 25 శాతంతో 4,862 బ్యాలెట్ యూనిట్లు(మలక్ పేట్ – 750, కార్వాన్ – 778, గోషామహల్– 588, చార్మినార్ –495, చాంద్రాయణ గుట్ట –763, యాకుత్ పురా –830, బహదూర్ పురా అసెంబ్లీ సెగ్మెంట్ – 658, కాగా మొత్తం –4862) అవసరం కాగా మొదటి విడత లో 2,427 యూనిట్లు కేటాయించామన్నారు.
ఆదివారం రెండో విడత ద్వారా 2,427 బ్యాలెట్ యూనిట్లను పోలింగ్ కేంద్రాల వారీగా కేటాయించామన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు వాహన అనుమతులను వెంటనే తీసుకోవాలని, ఫామ్– 8 సమర్పించిన 24 గంటల్లోనే ఐడీ కార్డు జారీ చేస్తామన్నారు. 10 పోలింగ్ స్టేషన్లకు ఒక సెక్టోరల్ అధికారిని నియమించమన్నారు. ఎన్నికల సందర్భంగా పనిచేయని మెషీన్ల స్థానంలో 20 నిమిషాల్లోపే సీసీ టీవీ వీడియో కవరేజ్ సమక్షంలో రీప్లేస్ చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో హైదరాబాద్ జనరల్ అబ్జర్వర్ పీఐ శ్రీవిద్య, డీఆర్ఓ వెంకటాచారి, అధికారులు పాల్గొన్నారు.