
వాషింగ్టన్: అక్రమ వలసదారులతో కూడిన రెండో విమానం అమెరికా నుంచి బయల్దేరినట్లు సమాచారం అందింది. ఈ విమానంలో అక్రమంగా వలస వెళ్లిన 119 మంది మైగ్రెంట్స్ ఉన్నట్లు వెల్లడైంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం శనివారం రాత్రి 10 గంటలకల్లా ఈ స్పెషల్ ప్లేన్ పంజాబ్‌లోని అమృత్సర్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కానుంది. 119 మంది అక్రమ వలసదారుల్లో పంజాబ్‌కు చెందినవాళ్లు 67 మంది, హర్యానావాళ్లు 33 మంది, గుజరాత్‌కు చెందినోళ్లు 8, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు చెందినవాళ్లు ఒక్కొక్కరు, ఇద్దరు చొప్పున గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌కు చెందివారు ఉన్నట్లు తెలిసింది.
ఇదివరకే అమెరికా నుంచి బహిష్కరణకు గురైన 104 మంది అక్రమంగా వలస వెళ్లినవారితో కూడిన మొదటి సైనిక విమానం ఈ నెల 5న అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది. వారిలో హర్యానా, గుజరాత్‌కు చెందిన 33 మంది, పంజాబ్‌కు చెందినవాళ్లు 30 మంది ఉన్నారు. అమెరికా ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇల్లీగల్ మైగ్రెంట్స్పై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నోళ్లును మనదేశానికి పంపించేస్తున్నారు.
విమానాలు అమృత్సర్కే ఎందుకు..?: పంజాబ్
ఇల్లీగల్ మైగ్రెంట్స్తో వస్తున్న విమానాలను అమృత్‌సర్‌లోనే ల్యాండింగ్ చేయడంపై పంజాబ్ నేతలు మండిపడుతున్నారు. కేంద్ర సర్కారు కావాలనే పంజాబ్ పరువు తీస్తోందని ఫైర్ అవుతున్నారు. ఆమెరికా నుంచి వచ్చే స్పెషల్ ఫ్లైట్లను గుజరాత్, హర్యానా, ఢిల్లీలో ఎందుకు ల్యాండ్ చేయట్లేదని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా ప్రశ్నించారు. పంజాబ్‌ను అప్రతిష్టపాలు చేయాలని కేంద్రం భావిస్తోందన్నారు. మరోవైపు పంజాబ్ నుంచి యూకే, యూఎస్, మెక్సికో వంటి దేశాలకు అక్రమ వలసలు నివారించేందుకు పంజాబ్ సర్కారు ఇటీవల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ టీమ్ గతవారం అమెరికా నుంచి వచ్చిన ఇల్లీగల్ మైగ్రెంట్స్‌ను విచారించగా.. ఇప్పటివరకు 10 మంది ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్లపై కేసులు పెట్టింది. ఈ కన్సల్టెంట్లు రూ.40 లక్షల నుంచి 50 లక్షలదాకా తీసుకుని బాధితులను ఇతర దేశాలకు అక్రమంగా తరలిస్తున్నట్లుగా గుర్తించింది.