- దాని ప్రకారమే ఎంపీ టికెట్ల ప్రకటన
- మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్
- మేం 14 సీట్లు గెలుస్తం.. రేపు ఫస్ట్ లిస్ట్ వచ్చే చాన్స్
- కాళేశ్వరంపై ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్తే అదే చేస్తం
- బీఎస్పీ మాకెప్పుడూ మిత్రపక్షంగా లేదు
- ఎవరేంటనేది ఇప్పుడిప్పుడే ప్రజలకు తెలుస్తున్నది
- ఫామ్‌హౌస్‌లు ఉన్నోళ్లు, ట్యాక్స్ పేయర్స్‌కు
- ‘రైతు భరోసా’ ఇవ్వబోమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉన్నదని.. దాని ప్రకారమే ఎంపీ టికెట్లు ప్రకటిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మెదక్, చేవెళ్ల సీట్ల విషయంలో ఎందుకు నాన్చుతున్నారో తెల్వంది కాదని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో 14 లోక్‌సభ సీట్లు గెలుస్తం. మా పనితీరుకు పార్లమెంట్ఎన్నికలు రెఫరెండం. ఈ నెల 7న ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది” అని తెలిపారు. రాహుల్ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నామని, ఇది హైకమాండ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు.
మంగళవారం సెక్రటేరియెట్‌లో మీడియాతో రేవంత్ చిట్‌చాట్ చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తమకు ఎప్పుడూ మిత్రుడు కాదని, ఆయన బీఆర్ఎస్తో కలిశారంటే ఎవరు ఏంటనే మబ్బులు ఇప్పుడిప్పుడే తొలగిపోతున్నాయని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకే రావట్లేదని, అలాంటప్పుడు ఆయన ప్రతిపక్ష నేత ఎలా అవుతారని ప్రశ్నించారు. ‘‘అభివృద్ధి విషయంలో విపక్ష ఎమ్మెల్యేలు సీఎంను కలవడం సాధారణ విషయం.
గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ దాన్ని ఇంకోలా మార్చేశారు. నా కుటుంబం నుంచి ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయరు. ప్రభుత్వం పడిపోతుందని ఎవరైతే అంటున్నారో, ఎట్ల పడిపోతుందో వాళ్లనే అడగండి. నన్ను దించాలంటే కేసీఆర్, మోదీ కలవాల్సి ఉంటుంది” అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ జరుగుతోందన్నారు. తామేం అదానీకి ఎయిర్‌పోర్టులు చౌకకే కట్టబెట్టడం లేదని, అదానీ నుంచి పెట్టుబడులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు.
సాగు చేసేటోళ్లకే రైతు భరోసా..
ఫామ్‌హౌస్‌లు ఉన్నోళ్లకు, ట్యాక్స్ పేయర్స్‌కు రైతుభరోసా కింద పెట్టుబడి సాయం ఇవ్వాల్సిన అవసరం లేదని రేవంత్ అన్నారు. నిజంగా భూములు సాగు చేస్తున్న చిన్న, సన్నకారు రైతులకే రైతు భరోసా అందజేస్తామని తెలిపారు. దీనిపై అసెంబ్లీలో చర్చించి, అవసరమైతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.గజ్వేల్, జన్వాడలో ఫాంహౌస్‌లు ఉన్నోళ్లకు పెట్టుబడి సాయం అవసరం ఏముంటుందన్నారు. ‘‘గతంలో రాళ్లు రప్పలకు, రహదారులకు రైతుబంధు ఇచ్చారు. కానీ మేం కేవలం భూములు సాగు చేస్తున్న రైతులకే రైతుభరోసా ఇస్తం. సాగు భూములకే పెట్టుబడి సాయం అందజేస్తం” అని పేర్కొన్నారు.
అందుకే పెద్దన్న అన్నాను.. ప్రధాని మోదీని పెద్దన్న అని అంటే తప్పేముందని రేవంత్ ప్రశ్నించారు. ఆయన దేశానికి ప్రధాని కనుకనే పెద్దన్నగా అభివర్ణించానని పేర్కొన్నారు. ‘‘అమెరికాను బిగ్ బ్రదర్ అని ఎలా అంటారో.. అలాగే ఫెడరల్ స్టేట్స్ ఉన్న దేశంలో ప్రధానిని పెద్ద న్నగా వ్యవహరించాం. అందులో వేరే ఉద్దేశాలు లేవు. ఇందులో ఏదో ఉందని అనుకుంటే ఎలా? నేనేం కేసీఆర్‌లా తలుపులు మూసేసి చెవిలో ఏదో చెప్పలేదు కదా. మైక్‌లో 4 కోట్ల మందికి వినిపించేలా మాట్లాడాను” అని చెప్పారు.
కాళ్వేశ్వరంపై ఎన్డీఎస్ఏ చెప్పినట్టే చేస్తం..
కాళేశ్వరంపై బీజేపీ వాళ్లే ప్రధానిని తప్పుదోవ పట్టించారని రేవంత్ అన్నారు. అందులో భాగంగానే ఏటీఎం వంటి కామెంట్లు పీఎం చేశారన్నారు. కాళేశ్వరంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్‌పర్ట్‌కమిటీ ఏం చెబితే అదే చేస్తామని స్పష్టం చేశారు. 4 నెలల్లో రిపోర్టు వస్తుందని, ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లోపు రిపోర్టు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.
‘‘కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. మేడిగడ్డలో కాఫర్ డ్యామ్ కట్టాలని, నీళ్లు నింపాలని అంటున్నారు. కానీ వంద శాతం పర్ఫెక్ట్గా ఉంటేనే అది సాధ్యపడుతుంది. మొత్తం నీళ్లు నింపినంక వరదకు కొట్టుకుపోయి ఊర్లకు ఊర్లు మునిగితే ఏం చేస్తారు? అందుకే టెక్నికల్ అంశాలపై నిపుణల రిపోర్టునే ఆధారం చేసుకుంటాం. ఒకవేళ కమిటీ రిపేర్లు చేయమని చెబితే రిపేర్లు చేస్తాం. మేడిగడ్డపై అధికారులకు విచారణ బాధ్యతలు అప్పగిస్తే, దొంగకు చార్జ్ షీట్ వేయమని చెప్పినట్లే అవుతుంది. అందుకే ఎన్డీఎస్ఏ ను అడిగాం. 99 శాతం అధికారులు కాళేశ్వరంలో భాగస్వాములు అయినవాళ్లే ఉన్నారు” అని పేర్కొన్నారు.
నిపుణుల రిపోర్టు ఆధారంగానే ముందుకుపోతామని, కక్షపూరితంగా వ్యవహరించమని చెప్పారు. కాళేశ్వరానికి, తుమ్మిడిహెట్టికి సంబంధం లేదని స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టితో ఆదిలాబాద్‌ను సస్యశ్యామలం చేస్తామన్నారు.
తిన్నది అరగక ధర్నాలు అంటున్రు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇసుకతో రోజుకు రెండున్నర కోట్ల ఆదాయం పెరిగిందని, జీఏస్టీ ఆదాయం రూ. 300 కోట్లు పెరిగిందని రేవంత్ తెలిపారు. ప్రజలపై ఎలాంటి పన్నుల భారం మోపకుండానే రాబడి పెంచుతున్నట్లు చెప్పారు. ‘‘గత సర్కార్‌లోని కొందరు ప్రభుత్వ ఆదాయనికి గండి కొట్టేలా కమీషన్లకు తెరదీశారు. లంచాలు తీసుకుని ప్రభుత్వానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చారు. ఈ వ్యవహారంలో రూ.వందల కోట్ల గోల్ మాల్ జరిగింది. ఇందులో బీఆర్ఎస్ వాళ్లే ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్లు తిన్నది అరగక ఎల్ఆర్ఎస్విషయంలో ధర్నాలు చేస్తామంటున్నారు.
కేటీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల దాకా నీళ్లు ముట్టుకోకుండా నిరాహార దీక్ష చేయాలి” అని సవాల్ విసిరారు. ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ల పరిశీలన జరుగుతున్నదని, అధికారుల నివేదిక వచ్చాక స్పష్టత ఇస్తామన్నారు. సీఏంఆర్ఎఫ్ పై ఇంటర్నల్ ఆడిట్ జరుగుతున్నదని చెప్పారు. రైతుబంధు రూ.4,500 కోట్ల దాకా ఇచ్చినట్లు పేర్కొన్నారు.
Also Read: ఓరుగల్లులో వాడుతున్న గులాబి
జర్నలిస్టులు ఎప్పుడూ ప్రతిపక్షమే
బషీర్ బాగ్, వెలుగు: సమాజంలో జర్నలిస్టులది ఎప్పుడూ ప్రతిపక్ష పాత్రేనని.. ప్రజా సమస్యలను లేవనెత్తి, అవి పరిష్కారమయ్యేలా చేసే అవకాశం వారికి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో దివంగత పొత్తూరి వెంకటేశ్వరరావు స్మారక అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్నారు. ఇండియాటుడే మాజీ ఎడిటర్ వెంకట్ నారాయణకు పొత్తూరి స్మారక అవార్డును సీఎం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వెంకటనారాయణ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనాత్మక వార్తలు రాశారని కొనియాడారు.
తన చేతుల మీదుగా పొత్తూరి అవార్డును అందజేయడం సంతోషంగా ఉందన్నారు. పరిశోధనాత్మక జర్నలిజంతో పెద్ద పెద్ద నాయకులనే జర్నలిస్టులు కిందికి దించారన్నారు. పత్రికలు, టీవీలకు స్వేచ్ఛను ఇస్తూ వారి సమస్యలను పరిష్కరించేలా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. గతంలో పీవీ, ఎన్టీఆర్, నీలం సంజీవరెడ్డి, జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు లాంటి వాళ్లు జాతీయస్థాయిలో తెలుగు జాతి సత్తా చాటారన్నారు.
ప్రస్తుతం జాతీయ స్థాయిలో తెలుగువారి పాత్ర తగ్గుతోందన్నారు. ఇది మంచి పరిణామం కాదన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీని ప్రభావితం చేసే వారిని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు రామచంద్రమూర్తి, పాశం యాదగిరి, పౌర హక్కుల నేత ప్రొ. హరగోపాల్ పాల్గొన్నారు.