ఆరోగ్యశ్రీ అక్రమాలపై సీక్రెట్‍ ఎంక్వైరీ

ఆరోగ్యశ్రీ అక్రమాలపై  సీక్రెట్‍ ఎంక్వైరీ

వరంగల్‍, వెలుగు: ఓరుగల్లులో ఆరోగ్యశ్రీ సేవలు అందించే క్రమంలో పలు ప్రైవేట్‍  హాస్పిటల్స్​ అక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్‍లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్, విజిలెన్స్​ ఎన్‍ఫోర్స్​మెంట్‍  అధికారులు విచారణ చేపట్టారు. ప్రైవేట్‍ హస్పిటల్స్​లో ఆరోగ్యశ్రీ స్కీం అక్రమాలపై వెలుగు మెయిన్​ పేపర్‍ లో ఈ నెల 14న ‘ఆరోగ్యశ్రీ ట్రీట్‍మెంట్‍  కావాలా? బిల్లులో 50 శాతం కట్టాల్సిందే’ హెడ్డింగ్‍తో వార్త ప్రచురించింది. 

అదేరోజు కొందరు బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని ఫిర్యాదు రూపంలో ట్రస్ట్  పెద్దలతో పాటు కలెక్టర్‍  దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్​ అధికారులు స్పందించారు. విజిలెన్స్​ ఏసీపీతో పాటు చీఫ్‍  మెడికల్‍  ఆడిటర్‍  డాక్టర్‍  దయానంద్‍  రెండ్రోజుల పాటు గ్రేటర్‍ వరంగల్లో పర్యటించారు. ఎక్కువ ఫిర్యాదులు అందిన హనుమకొండ, వరంగల్​లోని హాస్పిటల్స్​కు వెళ్లారు. ఆరోగ్యశ్రీ ఉద్యోగులతో సంబంధం లేకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొందరు బాధితులతో మాట్లాడారు. కలెక్టర్‍ను కలిసి హాస్పిటల్స్​ అక్రమాలపై చర్చించారు. 

వరంగల్‍  కలెక్టర్‍  సత్య శారద సైతం డీఎంహెచ్ వోలతో రివ్యూ నిర్వహించారు. ప్రైవేట్‍  హాస్పిటల్స్​లో దోపిడీని ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద పేషెంట్లకు సూపర్​ స్పెషాలిటీ ట్రీట్‍మెంట్‍ అందించేందుకు గతంలో ఉన్న ఆపరేషన్‍  చార్జీలను 25 శాతం పెంచింది. కాగా, వరంగల్​లో పదుల సంఖ్యలో ప్రైవేట్‍  హాస్పిటల్స్​ యాజమాన్యాలు బాధితులను తప్పుదారి పట్టించి ట్రీట్‍మెంట్‍ చార్జీల్లో 50 శాతం డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. 

వరంగల్‍, హనుమకొండ ప్రాంతాల్లో కిడ్నీ, ఆర్థోపెడిక్‍, గ్యాస్ట్రో, కార్డియాలజీ హాస్పిటల్స్​లో పలువురు పేషెంట్ల వద్ద ఇదే తరహాలో వసూలు చేశారు. ఆరోగ్యశ్రీ సేవల గురించి తెలియని బాధితులు.. డాక్టర్లు చెప్పింది నమ్మి సొంత డబ్బులతో ప్రైవేట్​లో చికిత్స చేసుకోవాల్సి వచ్చింది. ఇదే పేషెంట్ల పేరుతో హస్పిటల్స్​ ఆరోగ్యశ్రీ బిల్లులు పెట్టుకున్నారు.