- హాజరైన లోకల్ ప్రజా ప్రతినిధులు
- పార్టీలో అవమానిస్తున్నారని ఆవేదన
- ఎన్నికల బరిలో దిగడంపై చర్చ
- తెరపైకి కోనపురి కవిత పేరు
యాదాద్రి, వెలుగు: సాఫీగా సాగుతున్న భువనగిరి బీఆర్ఎస్లో బీసీ లొల్లి మొదలైంది. బీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మూడోసారి ఎన్నికల బరిలో దిగిన విషయం తెలిసిందే. దీంతో బీసీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీసీలో గతంలో ఎలాగూ అవకాశం ఇవ్వలేదు. తెలంగాణ వచ్చాక జరుగుతున్న మూడో ఎన్నికలోనైనా అవకాశం ఇస్తారని భావించినా.. నిరాశే ఎదురైంది. దీంతో పార్టీలోని బీసీ వర్గానికి చెందిన లీడర్లు, ప్రజాప్రతినిధులు ఏకమవుతున్నారు. ఈ మేరకు రెండు రోజుల కింద సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై చర్చించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. తాము పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నామని, బీసీ నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసి తమ తడఖా ఏంటో చూపిస్తామని ప్రకటించారు.
దశాబ్దాలుగా ఓసీలే గెలుస్తున్నరు
భువనగిరి ఎమ్మెల్యేలుగా దశాబ్దాలుగా ఓసీలే గెలుస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వా త కూడా బీఆర్‌ఎస్ నుంచి పైళ్ల శేఖర్‌రెడ్డి రెండుసార్లు గెలిచారు. ఈసారి కూడా ఆయనే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో బీసీల్లో అసంతృప్తి మొదలైంది. ఈ విషయం ఓసీ లీడర్ల వరకు వెళ్లడంతో సర్వీస్ చేయాలంటే తామేనని, బీసీలతో కాదని అన్నట్లు తెలిసింది. ఈ కామెంట్లను సీరియస్‌గా తీసుకున్న కురుమ, గొల్ల కులాలకు చెందిన లీడర్లు మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రమైన భువనగిరిలో సీక్రెట్మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి వరకూ కొనసాగిన ఈ మీటింగ్‌లో ఓసీల నుంచి తమకు జరుగుతున్న అవమానాలు ఏకరువు పెట్టారు.
భువనగిరిలో మొదటి నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన బెల్లి లలిత, కోనపురం సాంబశివుడు, కోనపురం రాములు సహా పలువురు వివిధ రూపాల్లో పోరాటాలు నిర్వహించిన సంగతిని గుర్తు చేసుకున్నారు. వీరిని అణిచివేయడానికే ఓసీ లీడర్లు నయీం లాంటి వారిని పెంచి పోషించారని ఆరోపించారు. తాము పెంచి పోషించిన నయీం ప్రమాదంగా మారితే ఆ వ్యక్తే లేకుండా చేశామని, బీసీలు ఓ లెక్కనా అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీసీలంటే ఓసీలకు లెక్కలేకుండా పోయిందని, కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి చెక్ పెట్టాలంటే.. బీసీల్లోని అన్ని కులాలను, ఎస్సీ, ఎస్టీలను కూడా కలుపుకొని ఎన్నికల బరిలో నిలబడాలని సూత్రప్రాయంగా నిర్ణయానికొచ్చారని తెలిసింది.
అభ్యర్థిగా కోనపురి కవిత..?
వలిగొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కోనపురి కవితను బీఆర్‌ఎస్ నుంచి రెబల్ అభ్యర్థిగా రంగంలోకి దింపాలన్న ప్రతిపాదన వచ్చిందని సమాచారం. బీసీ సామాజిక వర్గానికి చెందిన కోనపురి కవిత అందుకు సమ్మతించినట్టుగా తెలుస్తోంది. బీసీలతో పాటు ఇతర వర్గాల నుంచి కవితపై ఒత్తిడి తెచ్చిన విషయాన్ని మీటింగ్‌లో ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఈ మీటింగ్‌కు హాజరైన పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు మాత్రం ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఆచీతూచి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. అధికారంలో ఉన్న పార్టీని ఢీకొట్టాలంటే క్యాడర్‌తో పాటు ధనబలం ఉండాలని చెప్పినట్లు తెలిసింది. అందరి అభిప్రాయాల మేరకు ఈ నెల 16లోగా నిర్ణయం తీసుకోనున్నారని ఓ బీసీ లీడర్ చెప్పారు.
ఇంకా నిర్ణయం తీసుకోలేదు
దశాబ్దాలుగా భువనగిరిలో బీసీలకు ప్రాధాన్యం లేకుండా పోతోంది. బీసీలు ఎమ్మెల్యేలు కావాలన్న చర్చ కూడా ఎప్పటి నుంచో నడుస్తోంది. నన్ను అభ్యర్థిగా నిలబడమని బడుగు బలహీన వర్గాల నుంచి ఒత్తిడి వస్తోంది. నేను కూడా ఆలోచిస్తున్నా. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
కోనపురి కవిత