ప్రజా గాయకుడు నిస్సార్ మృతి

ప్రజా గాయకుడు నిస్సార్ మృతి

ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజా వాగ్గేయకారుడు మహ్మద్ నిస్సార్ క‌న్నుమూశారు. కొన్ని రోజులుగా శ్వాస సంబంధింత వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గాంధీ హాస్పిట‌ల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ బుధ‌వారం తెల్ల‌వారుజామున చ‌నిపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండలం, సుద్దాల గ్రామంలో పుట్టిన మహమ్మద్ నిస్సార్ మొదటి ప్రస్థానం లారీ డ్రైవర్ గా మొదలు పెట్టి.. ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే చిన్నప్పటి నుండి అనేక ప్రజా ఉద్యమాలపైన పాటలు రాస్తూ.. వేలాది సభలకు నాయకత్వం వహించారు. కరోనా పైన పాటలు రాశారు. అనేక వృత్తుల‌వారు ఎదుర్కొంటున్న సమస్యలపైన విప్లవ గేయాలు రచించారు.

20 రోజుల క్రితం తన స్వగ్రామం సుద్దాల గ్రామంపైన, అదేవిధంగా గీత కార్మికుల కష్టాలపైన షార్ట్ ఫిలిం తీశారు. ఆయన మృతి వార్తతో సుద్దాల గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది. నిస్సార్ 10 రోజులుగా శ్వాస సంబంధిత వ్యాధాతో బాధ‌ప‌డుతున్నార‌ని.. స‌కాలంలో క‌రోనా ప‌రీక్ష చేస్తే, ఫ‌లితం ఆధారంగా జాగ్ర‌త్త‌లు తీసుకునేవార‌ని చెబుతున్నారు ఆయ‌న‌ స‌న్నిహితులు. మాన‌వ‌త్వం, మంచిత‌నంగ‌ల వ్య‌క్తి ఉన్న‌ట్టుండి చ‌నిపోవ‌డంతో జీర్ణించుకోలేక పోతున్నామ‌ని చెబుతున్నారు సుద్దాల గ్రామ‌స్థులు.