తెలంగాణ చరిత్రకు మతం రంగు పులుమొద్దు

తెలంగాణ చరిత్రకు మతం రంగు పులుమొద్దు
  • మతోన్మాద శక్తుల వక్రీకరణను తిప్పి కొట్టండి: సురవరం 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాటం మహోత్తరమైన్నదని, కొన్ని మతోన్మాద శక్తులు నిజాలను వక్రీకరిస్తూ హిందూ, ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తున్నాయని.. ఈ కుట్రలను తిప్పికొట్టాలని సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో 4 భాషల్లో ముద్రించిన బుక్​లెట్ ను శనివారం బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్​లో ఆయన ఆవిష్కరించారు.

అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాట సేనాని రావి నారాయణరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాలతో లిఖించదగినదన్నారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, వాస్తవికతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

తెలంగాణను లౌకిక ప్రజాస్వామ్యం వైపు నడిపించాలని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్ర, పోరాటంతో సంబంధం లేని మతోన్మాదశక్తులు తెలంగాణ చరిత్రకు మతం రంగును పులుముతున్నారని మండిపడ్డారు.  తెలంగాణ సాయుధ పోరాట వాస్తవిక గాథ నేటి యువతరానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు.