యాదాద్రి, వెలుగు : ప్రైమరీ, కమ్యూనిటీ, జిల్లా హాస్పిటల్స్‌లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తూ సూచించారు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి, అనంతారం, భువనగిరిలోని హాస్పిటల్స్, మెడికల్ కాలేజీని గురువారం ఆమె సందర్శించారు. పీహెచ్‌సీల్లో గర్భిణులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి హాస్పిటల్‌లో అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకొని, మందుల నిల్వలు పరిశీలించారు.
జిల్లాలో ఆరు ఆరోగ్య మహిళా క్లినిక్‌ల ద్వారా మహిళలకు అందుతున్న సేవలు, వారి సమస్యలను, పోర్టల్‌లో స్క్రీనింగ్ విధానాలను పరిశీలించారు. భువనగిరిలోని జిల్లా హాస్పిటల్‌లో నవజాత శిశు సంరక్షణ విభాగాన్ని, తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ విభాగాన్ని, సిటీ స్కాన్, బయో కెమిస్ట్రీ, పాథలాజికల్ ల్యాబ్ పనితీరును తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నార్మల్ డెలివరీలు, మాతా శిశు ఆరోగ్య సేవల పట్ల క్షేత్రస్థాయి నుంచే అవగాహన కల్పించాలని ఆదేశించారు. స్పెషాలిటీ డాక్టర్లు ప్రతి వారం పీహెచ్‌సీల్లో వైద్య సేవలు అందించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కోసం డయాగ్నస్టిక్ డిస్ట్రిక్ట్ హబ్ విభాగంపై మరో ఫ్లోర్, మాతా శిశు సంరక్షణ కోసం కొత్త బ్లాక్ నిర్మాణానికి ప్రపోజల్స్ పంపాలని సూచించారు. ఆమె వెంట ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆర్‌వీ. కర్ణన్, కలెక్టర్ హనుమంతు జెండగే, అడిషనల్ కలెక్టర్ గంగాధర్, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు, చిన్నూనాయక్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రమేశ్‌రెడ్డి, డీఎంహెచ్‌వో మనోహర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో యశోధ ఉన్నారు.