మనిషి నడకతో మొదలుపెట్టి తన జీవన పోరాటంలో పనిముట్లను వాడడం, వ్యవసాయం చేయడం, నీరు కోసం నదుల పక్కనే ఆవాసాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా ఈ భూమండలం మీద మనిషి నీరున్న చోటనే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నాడు. నాగరికత పెంపొందించుకొని చిన్న చిన్న ఆవాసాల కూటమిగా, గ్రామాలుగా, నగరాలుగా, పట్టణాలుగా, దేశాలుగా, ఖండాలుగా ఎర్పడ్డాయి.
రాతి యుగం, మధ్య రాతి యుగం వరకు నదులున్న చోటనే ప్రజలు ఆవాసాలు నిర్మించుకున్న విషయం మనకు చరిత్ర చెబుతున్నది. ఆధునిక యుగంలో పారిశ్రామికంగా ఎదిగిన తర్వాత తన అవసరాల కోసం మనిషి నీళ్లను తన దగ్గరికి తెప్పించుకున్నాడు. ఎంతో చరిత్ర కలిగిన ఇప్పటి హైదరాబాద్నగరం కూడా మూసీ నదీ తీరాన వెలిసిందే.
కృష్ణానదికి ఉప నది మూసీ
కృష్ణానదికి ఉప ముఖ్యనదిగా పేరుగాంచిన మూసీ నది అనంతగిరి వికారాబాద్ పర్వతాల్లో పుట్టింది. హైదరాబాద్ నగరం గుండా ప్రవహిస్తూ వాడేపల్లి మిర్యాలగూడ వద్ద కృష్ణాలో కలుస్తున్నది. హైదరాబాద్ లో 1908 సెప్టెంబర్ 28 న వచ్చిన పెద్ద వరద కారణంగా దాదాపు 15,000 మంది చనిపోయారు. 80,000 మంది నిరాశ్రయులయ్యారు. అప్పట్లో దీన్ని ఒక పెద్ద విపత్తుగా పరిగణించారు.
ప్రముఖ ఇంజినీరు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అప్పటి నైజాం కోరిక మేరకు వరద బాధల నుంచి తప్పించాలని ఆనాడు మూసీనదిపై గండిపేట వద్ద ఉస్మాన్ సాగర్ రిజర్వాయరును 1920లో, మూసీ నది ఉపనది అయిన ఈసీ నదిపై హిమాయత్ సాగర్ 1927 రిజర్వాయర్ ను, రెండు జలాశయాలను నిర్మించి హైదరాబాద్ ప్రజలకు తాగునీటి, మురుగు నీరు వ్యవస్థను ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం కనుగొన్నారు.
మూసీ 240 కిలోమీటర్ల పొడవు ఉంది. ఉత్తర భారతదేశం నుంచి చాలామంది వ్యాపారం కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ర్టం ఉన్నప్పుడు ఆంధ్రా ప్రజలు చాలామంది ఇక్కడ సెటిల్ అయినారు. గత ప్రభుత్వాలు పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని జంట నగరాల అవసారాల దృష్ట్యా మంచినీటిని మంజీర, సింగూర్ గోదావరి , కృష్ణా నదుల నుంచి పైపులైన్ల ద్వారా దశలవారీగా ప్రాజెక్టులను పూర్తి చేశారు.
భూగర్భ జలాల్లో కాలుష్యం
1931 లో మొట్టమొదటగా మురుగు నీరు శుభ్రం చేయడానికి అంబర్‌పేటలో 12 మిలియన్ గ్యాలన్ల సామర్థ్యం గల శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. తాగు నీరు సమస్య తొలగిపోయింది. కానీ, మూసీ నదికి రెండు వైపుల నుంచి కాలక్రమేణా వ్యర్థాలు, పరిశ్రమల వ్యర్థాలు రావడం మొదలైంది. మూసీలో చేరుతున్న మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలకు తగినంతగా మురుగునీరు శుద్ధికి గత ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకోలేదు. 1997లో నందనవనం పేరుతో మూసీ సుందరీకరణ కోసం ఉమ్మడి ఏపీ ప్రభుత్వ కాలంలో.. కులీ కుతుబ్‌షా అర్బన్ డెవలప్మెంట్అథారిటీ ఒక పథకం రూపొందించింది.
అనంతరం వాటరు బోర్డు అబెట్మెంట్ఆఫ్ పొల్యూషన్ ఆఫ్ మూసీ రివర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో రూ. 405 కోట్లు నిధులు ఖర్చు చేశారు . కాలుష్య నియంత్రణకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ రూ .50 కోట్లతో రబ్బరు డ్యామ్ నిర్మించారు. కానీ, నిరుపయోగమైనది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, హెచ్ ఎండీఏ, హెచ్ ఎండబ్ల్యూఎస్ మధ్య సమన్వయం లేక సుందరీకరణగాని, కాలుష్య నివారణగాని జరగలేదు.
2017లో ఎంఆర్ డీసీఎల్ ఏర్పాటైనా మూసీ యథావిధిగా దుర్వాసన కలుషితమైన నీరుతోనే కనబడుతున్నది. కలుషితమైన నీటితో పండించిన వ్యవసాయోత్పత్తులు కూడా పూర్తిగా రసాయనాలతో కూడి ఉన్నాయని ఒక స్టడీలో ఉస్మానియా యూనివర్సిటీ తెలిపింది. పలు సంస్థలు, ఎన్ జీఆర్ఐ శాస్త్రవేత్తలు చేసిన పరీక్షలో మూసీ పరీవాహకం భూగర్భ జలాలు కాలుష్యంతో నిండిపోయినట్లు తేలింది.
హైకోర్టులో పిల్
అహ్మదాబాద్ లో సబర్మతీ నదిని శుద్ధి చేసే తరహా లోనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మూసీనదిలోకి వ్యర్థాలను శుద్ధి చేసిన అనంతరం వదలాలని, నదిని కాలుష్యం నుంచి కాపాడాలని లేదా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఎం పద్మనాభరెడ్డి, ప్రెసిడెంట్ ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అప్పటి సెక్రటరీ హోదాలో 2016లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం హై కోర్టులో దాఖలు చేశారు. దీనిపై నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ రమేశ్ రంగనాథన్ తో కూడిన ధర్మాసనం స్పందిస్తూ కాలుష్యం నివారణకు మూసీ నదికి సంబంధించి ఏ విధమైన ప్రణాళికను అనుసరిస్తున్నారని తెలపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
బి రచనారెడ్డి న్యాయవాది పిటీషనరు తరఫున వాదనలు వినిపిస్తూ కాలుష్య పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. హెచ్ఎండీఏ తరఫు న్యాయవాది వై రామారావు మూసీ సుందరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక చైర్మన్‌ను నియమించింది. అధికారులు మూడుసార్లు సబర్మతీ నదిని చూసి వచ్చారు. అయితే, అప్పటి ప్రభుత్వం మూసీ కాలష్య నివారణకు, సుందరీకరణకు ఒక ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయించలేదు.
మూసీ సుందరీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు
సబర్మతీ నదీ తరహాలోనే మూసీనదిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాలలో చెబుతూ ఆ దిశగా ప్రపంచంలో పట్టణాల గుండా ప్రవహించే వివిధ నదుల గురించి స్వయంగా తెలుసుకొని, లండన్‌లో థేమ్స్ నదిని కూడా సందర్శించారు. మూసీనది శుద్ధికి, సుందరీకరణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది.
అందులో భాగంగానే గజ్వేల్ నియోజకవర్గంలోని కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా 15 టీఎంసీల తాగునీటిని హైదరాబాద్‌కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో 10 టీఎంసీల నీరు తాగునీటి అవసరాలకు సంపూర్ణంగా తీర్చడంతోపాటు , 5 టీఎంసీల నీటిని మురికికూపంగా మారిన మూసీనది ప్రక్షాళనకు ఉపయోగించబోతున్నారని , దానికి 4 వేల కోట్లకు పైగా వ్యయమయ్యే ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేశారని , దీనికి హడ్కో దాదాపు ఆమోద ముద్ర వేయబోతుందని పురపాలక అధికారులు చెబుతున్నారు. ఏడాదిన్నరలో ప్రాజెక్టును పూర్తిచేయాలన్నది జలమండలి లక్ష్యమని అధికారులు తెలిపారు.
రూ.58వేల కోట్ల అంచనా
మూసీనది ప్రక్షాళన, సుందరీకరణకు రూ. 58,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు తెలిసింది . కలుషితమైన మూసీ నదిని పునరుజ్జీవింపజేసే లక్ష్యంతో చేపట్టిన మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ 2024–25 సంవత్సరానికిగానూ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో ప్రత్యేకంగా ప్రాజెక్టు కోసం రూ.1,000 కోట్లను కేటాయించడంతో త్వరలో వాస్తవ రూపం దాల్చనుందని, గత అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. మున్ముందు మూసీలో మురుగు నీరు చేరకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవడం, దీనిపై వాటర్ బోర్డు డీపీఆర్ లను తయారుచేసింది.
లంగరు హౌస్ నుంచి ప్రతాపసింగారం వరకు రూ.3800 కోట్లతో చేపట్టనున్నారు. అయితే, మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశములో ప్రభుత్వంలో ఒక ఆలోచనను కార్యరూపం దాల్చాలంటే అది ఒక పెద్ద సవాల్ . ప్రజల అభివృద్ధి పనులకు ప్రధాన అడ్డంకి అవినీతి. మన ప్రభుత్వాలు ప్రతిఏటా ప్రజల మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేస్తూనే ఉంటాయి. నిర్మాణ దశలో నాణ్యతా ప్రమాణాలను పాటించినప్పుడే ఆ కట్టడాలు చిరస్థాయిగా ఉండి ప్రజలకు ఉపయోగపడతాయి. పర్యాటక కేంద్రాలుగా మారుతాయి. ఈ పనుల్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్వహించినప్పుడే ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయి.
- సోమ శ్రీనివాస్ రెడ్డి,
సెక్రటరీ,
ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్