గద్వాల, వెలుగు: ప్రజాపాలన దరఖాస్తును తీసుకొని రసీదు ఇవ్వాల్సిన ఆఫీసర్లు, గ్రామసభలోనే అప్లికేషన్‌ను రిజెక్ట్ చేస్తున్నట్లు ఫారమ్‌పై కొట్టేసి ఇచ్చారు. బాధితులు లక్ష్మి, హరిజన సరోజమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. కేటిదొడ్డి మండలం పాగుంట విలేజ్ లో ఈ నెల 3న గ్రామసభ నిర్వహించారు.
గ్రామానికి చెందిన లక్ష్మి, సరోజమ్మ అనే మహిళలు దరఖాస్తు ఫారాలు తీసుకెళ్తే అక్కడే ఉన్న సెక్రటరీ వాటిని తీసుకోకుండా, మీరు అర్హులు కాదంటూ దరఖాస్తు ఫారాలపై పెన్నుతో ఇంటు గుర్తు పెట్టి తిరిగి ఇచ్చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించినట్లు బాధితులు ఆరోపించారు. అప్లికేషన్ల గడువు ముగుస్తుండడంతో ఆందోళన పడిన మహిళలు శనివారం గ్రామంలోని లీడర్లకు చెప్పడంతో విషయం బయటికి వచ్చింది.
బీఆర్ఎస్ లీడర్లు చెప్పినట్లు సెక్రటరీ వ్యవహరిస్తున్నాడని వారు ఆరోపించారు. సెక్రటరీపై చర్య తీసుకొని అప్లికేషన్ ఫారాన్ని తీసుకొని నిరుపేద మహిళల కుటుంబాలను న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై ప్రజాపాలన స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావును వివరణ కోరగా, ఈ ఘటనపై ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. రేషన్ కార్డు లేకపోతే అప్లికేషన్ పెట్టుకోవడానికి వీలుండదని, ఎంక్వైరీ చేసి వివరాలు చెబుతామన్నారు.