కమ్మగూడలో భూవివాదం.. 164 సెక్షన్ అమలు

కమ్మగూడలో భూవివాదం.. 164 సెక్షన్ అమలు

 అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కమ్మగూడలో తలెత్తిన భూ వివాదంపై రెవెన్యూ అధికారులు అలర్ట్ అయ్యారు. సర్వే నంబర్ 240, 241, 242లో లా అండ్ ఆర్డర్ సమస్య రావడంతో బీఎన్ఎస్ 164 సెక్షన్​ అమలు చేస్తూ ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భూమి ఓ మహిళకు చెందినదని కోర్టు ఇటీవల తీర్పు ఇవ్వడంతో వారు స్వాధీనం చేసుకునేందుకు రాగా, ఆ భూములు కొన్నవారు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ సెక్షన్ అమలుతో ఇక్కడ ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్న వారు తప్ప ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు, పనులు, సమావేశాలు చేపట్టవద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కోర్టు నుంచి తదుపరి తీర్పు వచ్చేవరకు ఈ ల్యాండ్ రెవెన్యూ ఆధీనంలో ఉంటుందన్నారు.