పులివెందులలో రెండో రోజు జగన్ పర్యటన.. క్యాంప్ ఆఫీస్ వద్ద భద్రత పెంపు..

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పులివెందులలో పర్యటిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు మొదటిరోజు హాజరైన జగన్ ఎమ్మెల్యేగా సభలో ప్రమాణ స్వీకారం చేశాక పులివెందుల పర్యటనకు వెళ్లారు.తొలిరోజు పులివెందుల పర్యటనలో జగన్ ను కలిసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పెద్ద జగన్ క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వచ్చారు.అయితే, కార్యకర్తల తాకిడి ఎక్కువైన నేపథ్యంలో జగన్ క్యాంప్ ఆఫీస్ వద్ద కాసేపు గందరగోళం నెలకొంది. జగన్ ను కలిసేందుకు కార్యకర్తలు ఎగబడటంతో తోపులాట జరిగి ఆఫీస్ కిటికీ అద్దాలు కూడా పగిలాయి.

ఈ క్రమంలో రెండో రోజు జగన్ ఇంటివద్ద భద్రత పెంచారు పోలీసులు. మొదటిరోజు కార్యకర్తలను కట్టడి చేయటంలో విఫలమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండో రోజు జగన్ ను కలిసేందుకు కార్యకర్తలకు అనుమతివ్వలేదు.కేవలం వైసీపీ ముఖ్య నాయకులతోనే జగన్ రెండో రోజు భేటీ అయ్యారు. అనంతరం జగన్ బెంగళూరు బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.