భారత్​కు సెక్యులరిజం శాపమా వరమా?

‘‘సర్వేజనా సుఖినోభవంతు సర్వేసంతు నిరామయా!
సర్వేభద్రాణి పశ్యంతు మా కశ్చిత్  దుఃఖ మాప్నుయాత్!!’’

..అని భారతీయ సనాతన ధర్మం బోధిస్తోంది. అంటే సర్వ జనులు సుఖంగా జీవించాలని, వారికున్న  బాధలు, దుఃఖాలు తొలగిపోవాలని దీని భావం. సర్వేజనా అంటే సర్వజనులు అని తప్ప కేవలం హిందువులనో, మరో మతం వారు మాత్రమే సుఖంగా జీవించాలనో సనాతన ధర్మం ఏ రోజూ బోధించలేదు. అనాదిగా దీనినే హిందువులంతా పాటిస్తున్నారు. ఈ భావనపై ఇటీవల కాలంలో నమ్మకం ఎందుకు సడలుతోంది? అని పలువురిని తొలుస్తున్న ప్రశ్న. దీనికి కారణం.. ప్రధానంగా రాజకీయ పార్టీలు, నాయకుల స్వార్థమే. హిందువు తాను హిందువునని చెబితే వెంటనే మతతత్వవాది అని, అదే ముస్లిం ముస్లింనని, క్రిస్టియన్  క్రిస్టియన్​నని చెప్పినా సెక్యులర్ అని స్టాంప్ వేస్తుండడంతో దేశంలో ఈ దుస్థితి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ .. భారత్ లో సెక్యులరిజం అంటే, మైనారిటీల సంక్షేమం పేరుతో మెజారిటీ ప్రజలైన హిందువులను నిర్లక్ష్యం చేయడం అని అన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

హిందుత్వం ఒక మతం కాదు.. అది భారతీయుల జీవన విధానమని ఇటీవల సుప్రీంకోర్టు చక్కని భాష్యం చెప్పింది. ఇది నిజం కూడా. భారతదేశం అనాదిగా మతప్రమేయం లేని దేశంగానే కొనసాగుతోంది. అందుకే మన రాజ్యాంగ నిర్మాతలకు ప్రారంభంలో మన దేశాన్ని లౌకిక (సెక్యులర్) దేశంగా పేర్కొనాల్సిన అవసరం కనిపించలేదు. తర్వాత కాలంలో జరిగిన స్వార్థ రాజకీయాల కారణంగా ఆ పదం మన రాజ్యాంగంలో వచ్చి చేరడమే కాకుండా ఓటు బ్యాంకు రాజకీయాలకు కేంద్రంగా మారింది. ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక అనే పదాన్నిపొందుపరిచింది. లౌకికవాదం అనే పదాన్ని 19వ శతాబ్దానికి చెందిన సామాజిక శాస్త్రవేత్త జార్జి జాకబ్  హోలియోక్ మొదటి సారిగా వాడుకలోకి తెచ్చారు. సెక్యులరిజం అనే పదం లాటిన్  భాషలోని సెక్యులమ్ అనే పదం నుంచి ఉద్భవించింది. ఆ తర్వాత వాడుకలో.. ప్రభుత్వాన్ని, పరిపాలనను మతం ముఖ్యంగా చర్చి నుంచి వేరుచేయడం.. పాలనను చట్టం, రాజ్యాంగం ప్రకారం కొనసాగించడం అనే భావనలు లౌకికవాదంగా ప్రాచుర్యం పొందాయి.

సంస్కృతీ సంప్రదాయాలను నిషేధించక్కర్లేదు
భారతదేశం లౌకిక రాజ్యం.. నిజమే. అంతమాత్రాన వేల ఏండ్లుగా వస్తున్న సంస్కృతీ సంప్రదాయాలను నిషేధించాల్సిన అవసరం లేదు. అమెరికా కూడా లౌకిక రాజ్యమే. అయినా ఆ దేశ కరెన్సీ పై తాము దేవుడ్ని విశ్వసిస్తామన్న వ్యాఖ్య బోల్డ్ లెటర్స్ లో ఉంటుంది. ఆగ్నేయాసియాలో ఎన్నో ముస్లిం ప్రాబల్య దేశాల్లోనూ రామాయణ సంస్కృతిని గౌరవిస్తుంటారు. మరి మన సంస్కృతి పట్ల అలాంటి బోల్డ్ నెస్  మనకు ఎందుకు ఉండడం లేదు? ఇండోనేషియా ముస్లిం దేశం అయినప్పటికీ అక్కడి ప్రజలు రామాయణ, మహాభారతాలను చదువుతారు. హిందూ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను అనుసరిస్తారు. మన దేశంలో హిందుత్వానికి, భారతీయ సంస్కృతికి మధ్య ఉన్న విభజన రేఖ అతి పల్చటిది. అంత మాత్రాన వేల ఏండ్లుగా వస్తున్న సంప్రదాయాలపై వేటు వేయడం సమంజసమా అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. 

రాజ్యాంగంలో లౌకిక రాజ్యం అనే పదం లేదు
రాజ్యాంగంలో లౌకిక రాజ్యం అనే పదం ప్రత్యక్షంగా పేర్కొననప్పటికీ భారత్​ లౌకిక రాజ్యమే అని ప్రాథమిక హక్కుల్లోని ప్రకరణలు 25 నుంచి 28 వరకు స్పష్టం చేస్తున్నాయని జేవియర్ కాలేజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసు(1974)లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 1994లో ఎస్‌‌ఆర్ బొమ్మాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్నాటక కేసులో లౌకికతత్వం రాజ్యాంగంలోని మౌలిక సారాంశంలో అంతర్భాగమని, దీనిని ఉల్లంఘించే రాష్ట్రాలపై ఆర్టికల్​356 ప్రకారం చర్యలు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. లౌకికతత్వాన్ని సకారాత్మకంగా, నిర్మాణాత్మకంగా చూడాలని, పాఠశాలలో వివిధ మత విలువలను విద్యార్థులకు బోధించడం ద్వారా ఇతర మతాల పట్ల గౌరవాన్ని కలిగి ఉండటానికి, పరమత సహనానికి తోడ్పడుతుందని, అది లౌకికతత్వానికి విఘాతం కాదని 2003లో అరుణారాయ్ వర్సెస్ ఇండియన్ యూనియన్ కేసులో సుప్రీం అభిప్రాయపడింది. లౌకికతత్వం ముసుగులో స్థానికులైన హిందువులకు అన్యాయం చేస్తూ మైనారిటీల ఓట్ల కోసం ఎంతకైనా పలు పార్టీలు తెగబడుతున్నాయి. 

రోహింగ్యాలు మన దగ్గరికే ఎందుకొస్తున్నట్లు?
ప్రజలు వలస వెళ్తున్నారంటే వారుండే ప్రాంతంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకపోవడం ప్రధాన కారణంగా ఉంటుంది. కానీ మయన్మార్ నుంచి రోహింగ్యాలు మన దేశానికి ఎందుకు వచ్చినట్లు అనే విషయాన్ని ఈ పార్టీలు ఆలోచించడం లేదు. మయన్మార్​లో శాంతి కాముకులైన బౌద్ధులను రోహింగ్యా ముస్లింలు తీవ్రంగా హింసించే వారు. వీరి అరాచకాలు భరించలేక బౌద్ధులు తిరగబడడంతో బతుకు జీవుడా అంటూ భారత్  మీద పడుతున్నారు. మయన్మార్ కు అతి సమీపంలో ఉన్న  చైనాను కాదని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత్  రావడానికి ప్రధాన కారణం ఇక్కడి స్వార్థపరులైన రాజకీయ నాయకులే. సెక్యులరిజం పేరుతో వీరంతా వారి ఓట్లకు కక్కుర్తి పడడమే. 

వారికి భారత గుర్తింపు కార్డులే కాకుండా భారత పౌరసత్వం ఇప్పించడానికి కూడా వెనుకాడడం లేదు. తద్వారా మాతృ దేశానికి ద్రోహం చేస్తున్నాం, భవిష్యత్తులో దేశం నష్టపోవడమే కాకుండా తామూ ఆ ఊబిలో కూరుకుపోతామనే విషయాన్ని విస్మరిస్తున్నారు. ఇటీవల బెంగాల్ ఎన్నికల అనంతరం స్థానిక హిందువులపై విచక్షణా రహితంగా దాడులు చేసి, మహిళలపై అత్యాచారాలకు, ఆస్తుల విధ్వంసానికి పాల్పడింది అత్యధికంగా రోహింగ్యాలే. మయన్మార్ నుంచి తన్ని తరిమేసినా వీరి క్రూర మనస్తత్వంలో ఎలాంటి మార్పు రాలేదనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ అక్కర్లేదు. రోహింగ్యాలు భవిష్యత్తులో భారత్ కు ఎలాంటి ముప్పుగా పరిణమించబోతున్నారో  వివరంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి ప్రమాదాన్ని ముందే ఊహించి కాబోలు బంగ్లాదేశ్​ ప్రధాని హసీనా రోహింగ్యాలు తమ దేశ భద్రతకు పెనుముప్పుగా పరిణమించారని, ఏ దేశమైనా  రోహింగ్యాల్లాంటి వారిని ఎలా భరిస్తుందన్నారు. భారత్ లో సహజంగా జరగాల్సిన సీఏఏ, ఎన్​ఆర్​సీ లాంటి వాటికి సెక్యులరిజం పేరుతో అడ్డుపడుతున్న సూడో సెక్యులరిస్టులు, ప్రజలు ఛీ కొడుతున్నా చైనాకు వంతపాడే కమ్యూనిస్టులు, దినదినం కనుమరుగవుతున్న కాంగ్రెస్​, తృణమూల్ కాంగ్రెస్​, టీఆర్​ఎస్​ తదితర రాజకీయ పార్టీల నాయకులు దేశ ప్రజలకు జవాబు చెప్పాలి. ఇప్పటికైనా సెక్యులరిజం పేరుతో మెజారిటీ ప్రజలను మోసం చేయడం మానకపోతే రాజకీయ క్షేత్రం నుంచి కాంగ్రెస్, కమ్యూనిస్టులలాగా కనుమరుగవుతారనడంలో సందేహం లేదు.

లౌకికతత్వం ముసుగులో ఏమైనా చేయొచ్చా?
ఇటీవల తమిళనాడులోని వి కొలత్తూరు గ్రామానికి చెందిన ముస్లింలు తమ గ్రామంలో ముస్లింలు మెజారిటీగా ఉన్నందున హిందువులు పండుగలు జరుపకుండా ఆదేశించాల్సిందిగా దాఖలు చేసిన పిటిషన్​ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. ‘మతపరమైన అసహనం లౌకిక దేశమైన భారత్ కు మంచిది కాదు. ఒకవేళ ముస్లింలకు అనుకూలంగా తీర్పు ఇస్తే దేశంలోని చాలా ప్రాంతాల్లో మైనార్టీలు తమ మతాచారాలని పాటించడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది’ అని చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. లౌకిక వాదం అనేది ఇప్పుడు మన దేశంలో పెద్ద సమస్యగా తయారై కొన్ని పార్టీలు, మతాలు, వర్గాల వారు పలు సందర్భాల్లో అధికారంలో ఉన్న పార్టీలను, నాయకులను తమ చెప్పుచేతల్లో పెట్టుకొనే బ్రహ్మాస్త్రంగా మారింది. లౌకికవాదం ముసుగులో మెజారిటీ ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన ప్రజల్లో పెరుగుతోంది. ఇది మంచి పరిణామం కాదు. ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్  ‘లౌకికవాదం అంటే మతరహిత సమాజం కాదు. మత వ్యతిరేకం కాదు. ప్రాపంచిక సుఖాలు అంతకంటే కాదు. విశ్వవ్యాప్తమైన ఆధ్యాత్మిక విలువలను విభిన్న మార్గాల్లో అన్వేషించడమే’నని అన్నారు. 

- శ్యామ్ సుందర్ వరయోగి, కో-కన్వీనర్, బీజేపీ రాష్ట్ర ప్రశిక్షణ కమిటీ