గతేడాది జనవరి నుంచి కరోనా మహమ్మారిపై నరేంద్రమోడీ ప్రభుత్వం పోరాటం చేస్తోంది. కర్ఫ్యూలు, లాక్ డౌన్లు, ఆంక్షలు విధిస్తూ, హెచ్చరిస్తూ ప్రజలను చైతన్యపరుస్తోంది. ప్రధాని మోడీ స్వయంగా ప్రజల ముందుకొచ్చి తగిన సూచనలు చేస్తూనే ఉన్నారు. కానీ సెకండ్ వేవ్ విజృంభించడంతో పాలనలో కేంద్రం ఫెయిల్ అయ్యిందంటూ సోకాల్డ్ కుహనా లౌకిక, లిబరల్ వాదులు ఆరోపణలు చేస్తూ దేశ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు. వీరికి కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా తోడయ్యాయి. అయితే కరోనాను ఎదుర్కోవడంలో ఎంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న ప్రధాని మోడీకి ఇప్పుడు మనమంతా అండగా నిలవాలి.
కరోనాను ఎదుర్కొనేందుకు రూ.20 లక్షల కోట్లఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద రూ.1.7 లక్షల కోట్లతో సంక్షేమ చర్యలు చేపట్టింది. మెరుగైన వైద్య సదుపాయాల కోసం వేల కోట్లను విడుదల చేశారు. 202–1-22 బడ్జెట్ లో స్వాస్థ్య భారత్ యోజన కింద ఆరోగ్య రంగానికి రూ.64,180 కోట్లను కేటాయించింది. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు, ఆ తర్వాత 45 ఏండ్ల వయస్సు పైబడిన వారికి మొదటగా వ్యాక్సిన్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు 17.7 కోట్లకు పైగా వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఉచితంగా అందజేసింది. దేశ జనాభాలో 45 ఏండ్లు పైబడిన అర్హత కలిగిన 31శాతం మందికి టీకా ఫస్ట్ డోన్ ఇచ్చింది. ప్రస్తుతం 18 ఏండ్ల వయస్సు పై వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వటంలో కేంద్రం ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీని అన్నింటికీ బాధ్యుడిని చేయడమే పనిగా పెట్టుకున్నారు కొందరు కుహనా లౌకికవాదులు.
రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఆక్సిజన్ కొరత
రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా దేశంలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. పీఎం కేర్స్ నిధుల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 5, తెలంగాణకు 5, మహారాష్ట్రకు 10, ఢిల్లీకి 8 ఆక్సిజన్ ప్లాంట్లను కేంద్రం మంజూరు చేసింది. కానీ ఆయా ప్రభుత్వాలు వారి రాష్ట్రాలో ఒక్క ప్లాంటును మాత్రమే నిర్మించాయి. కరోనా కారణంగా ప్రజా అవసరాలకై మెడికల్ ఆక్సిజన్ తయారీ కోసం ఇండియన్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాల డ్రగ్ కంట్రోలర్లను అప్రమత్తం చేసింది. కేంద్రం ముందుచూపుతో 2020 ఏప్రిల్ 7నే మెడికల్ ఆక్సిజన్ తయారీకి అనుమతిస్తూ హెచ్చరిక కూడా జారీ చేసింది. అప్పుడు పెడచెవిన పెట్టిన రాష్ట్రాలు ఇప్పుడు గగ్గోలు పెడుతూ కేంద్రాన్ని నిందిస్తున్నాయి. కానీ, ఢిల్లీకి 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందించడంపై ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేయడమే కాక.. ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. అంటే ఢిల్లీలో పరిస్థితులు మెరుగయ్యాయని అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణలో దారుణమైన పరిస్థితులు
తెలంగాణలో కరోనా దూకుడుకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు, మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపించడం వల్ల ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగి భయానక వాతావరణానికి దారి తీసింది. కరోనా పేషెంట్లకు ఆస్పత్రుల్లో బెడ్స్ దొరక్కపోవడం, మందుల కొరత, ఆక్సిజన్ లేకపోవడానికి ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణం. వ్యాక్సిన్ వేసుకోవాలని కేసీఆర్ ఒక్కసారి కూడా రాష్ట్ర ప్రజలకు పిలుపునివ్వకపోవడంలో ఆంతర్యమేంటి? రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మరణిస్తుంటే కేసీఆర్ కనీసం సమీక్ష చేయకుండా ఫాంహౌస్ లో తీరిగ్గా విశ్రాంతి తీసుకుంటున్నారు. పైగా కేంద్రాన్ని బద్నామ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కేసీఆర్ వ్యాక్సిన్ వెసుకోకపోవడం అంటే వ్యాక్సినేషన్‌ను అవమానించటం కాక ఇంకేమిటి?
ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి ఏం సందేశం ఇస్తున్నరు
పారాసిటమాల్ వేసుకుంటే కరోనా తగ్గిపోతుందని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు కరోనా ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ దవాఖానాకు వెళ్లి ఏం సందేశం ఇస్తున్నారు. కరోనా నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలని కేంద్రం, హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వ తీరు మారకపోవటం బాధాకరం. కేంద్రం పంపిన వ్యాక్సినేషన్‌ను అత్యంత ఎక్కువగా వృథా చేసినది తెలంగాణనే. ఆక్సిజన్ అడిగిన దానికంటే మోడీ ప్రభుత్వం ఎక్కువే ఇచ్చింది. దేశ చరిత్రలో తొలిసారిగా తెలంగాణకు మిలటరీ విమానాల ద్వారా ఒడిశా నుంచి టన్నుల కొద్ది ఆక్సిజన్ పంపుతోంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి కేంద్రం పై నెపం మోపకుండా రాష్ట్రంలో పరిస్థితులను చక్కబెట్టే పనులు చేపట్టాలి.
400 టన్నుల ఆక్సిజన్ అందేలా ఏర్పాట్లు
తెలంగాణకు రోజుకు 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వచ్చేలా కేంద్రం ఏర్పాట్లు చేసింది. పీఎం కేర్స్ నుంచి 5 ఆక్సిజన్ ప్లాంట్లు మంజూరు చేయగా, మరో 12 ప్లాంట్లు రాబోతున్నాయి. వెయ్యి డీ టైపు ఆక్సిజన్ సిలిండర్లు పంపించింది. ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ద్వారా మెడికల్ ఆక్సిజన్ ను రవాణా చేసింది. తెలంగాణ అవసరాల దృష్ట్యా మెడికల్ ఆక్సిజన్ సత్వరం అందించేందుకు రక్షణ శాఖ యుద్ధ విమానాలు పంపించింది. అలాగే 48 లక్షల వ్యాక్సిన్ డోసులను, 1,400 వెంటిలేటర్స్, తెలంగాణకు అదనంగా 13,500 రెమ్డిసివిర్ ఇంజక్షన్లు ఇవ్వనుంది. తొలుత 21,500 ఇంజక్షన్లు కేటాయించగా ఇప్పుడా సంఖ్యను 35 వేలకు పెంచింది. అంతే కాకుండా గరీబ్ కల్యాణ్ ద్వారా మే, జూన్ లో పేదలకు ఉచితంగా 1,91,621 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు సమకూర్చనున్నది. ఏప్రిల్ 26 నాటికి రాష్ట్రానికి 41,58, 990 డోసులు అందించింది. వీటిలో 40,70,370 దోసులను వినియోగించారు.
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సేవలు
కరోనా విజృంభణ, కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ కొరత వేధిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సేవలందించడానికి ఆర్మీ చీఫ్‌తో ప్రధాని సమీక్ష చేశారు. సైన్యంలోని వైద్య సిబ్బంది, వాహనాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉంచడమే కాక.. వివిధ ప్రాంతాల్లో ఆర్మీ తాత్కాలిక ఆస్పత్రులను నిర్మించేలా ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు వైద్య సౌకర్యాలు కల్పించడమే కాకుండా 4 వేల పడకలు, 585 ఐసీయూ యూనిట్లు, 19 ఆస్పత్రులను రక్షణ శాఖ కేటాయించింది. మరో 752 పడకలను వివిధ సైనిక హాస్పిటల్స్ లో సిద్ధంగా ఉంచింది. ఎయిర్ ఫోర్స్ మే 5 వరకు విదేశాల నుంచి 1,142 టన్నుల సామర్థ్యం కల్గిన 61 ఆక్సిజన్ కంటెయినర్లను 50 ట్రిప్పుల ద్వారా తరలించింది. దేశీయంగా 4,527 టన్నుల సామర్థ్యం కలిగిన 230 కంటెయినర్లను 344 ట్రిప్పుల ద్వారా తరలించింది. ఇక నేవీ కూడా ఆక్సిజన్ అవసరాలను తీర్చడానికి వివిధ దేశాలను నుంచి షిప్‌లను నడుపుతోంది.
కరోనా మరణాల్లో మనది 120వ ప్లేస్
అమెరికా మొత్తం జనాభా 33 కోట్లు. కరోనాతో ఆ దేశంలో 5.75 లక్షల మంది చనిపోయారు. ఇంగ్లండ్ జనాభా 8 కోట్లు. కరోనాతో ఆ దేశంలో 1.27 లక్షల మంది చనిపోయారు. మనదేశ జనాభా 139 కోట్లు. ఇప్పటి వరకూ కరోనాతో 2.08 లక్షల మరణాలు సంభవించాయి. ప్రపంచ జనాభాలో ఇండియాది 2వ స్థానం, కరోనా మరణాల్లో 120వ స్థానం. ఈ లెక్కలు చూసినట్లయితే ఎవరు పరిపాలనలో ఫెయిల్ అయ్యారో, ఎక్కడ శ్మశానాల్లో శవాలు పూడ్చడానికి చోటు దొరకటం లేదో అర్థమవుతుంది. ఇండియా ప్రతిష్టను దెబ్బతీయడానికి అంతర్జాతీయంగా కుట్ర జరుగుతోంది. కరోనా సాకుతో ఇండియాను బూచిగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. దీనిని మనమంతా సమర్థవంతంగా తిప్పికొట్టాలి. విదేశాలతో పోల్చితే ఇండియాలో పరిస్థితి మెరుగ్గా ఉంది. 70 ఏండ్ల వయసులోనూ దేశం కోసం పని చేస్తున్నారు ప్రధాని మోడీ. కరోనా కేసులు, వ్యాక్సినేషన్, ప్రజల స్థితి గతులు ఇలా ప్రతి అంశంపై సమీక్షిస్తూ, వేగవంతమైన నిర్ణయాలతో పరిస్థితులను చక్కదిద్దుతున్నారు.