లోక్ సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ బైపోల్?

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఈ సెగ్మెంట్ ఉప ఎన్నికను లోక్ సభ ఎలక్షన్లతో కలిపి నిర్వహిస్తారని తెలుస్తోంది.  సభ్యులెవరైనా మరణిస్తే ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహించాలని నిబంధన ఉంది. అయితే, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ మరో 15 రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వాటితోపాటే కంటోన్మెంట్‌ ఉపఎన్నిక నిర్వహణ సాధ్యమా? కాదా? అనేది హాట్ టాపిక్ గా మారింది. 

ఇదీ ప్రాసెస్

ఎవరైనా సభ్యులు మరణిస్తే.. స్పీకర్ రాష్ట్ర సీఈవోకు సెగ్మెంట్ ఖాళీపై సమాచారం ఇవ్వాలి. దానికి సీఈవో కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపుతారు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ డెసిషన్ తీసుకుంటుంది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యేలోపు ఈ ప్రక్రియ పూర్తయితేనే కంటోన్మెంట్ సెగ్మెంట్ బై పోల్ లోక్ సభ ఎన్నికలతో పాటు జరిగే అవకాశం ఉంటుందని కొందరు చెబుతున్నారు. అయితే  షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు సంబంధించి ప్రత్యేక షెడ్యూల్‌ ప్రకటించి వాటితోపాటే ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 

ఈసీ అలెర్ట్

ఇదిలా ఉండగా లోక్ సభ ఎన్నికల కోసం ఈసీ కసరత్తును ముమ్మరం చేసింది. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘ రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ లేఖ రాసింది. మూడేండ్లుగా ఒకే పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో పనిచేస్తున్న అధికారుల జాబితా పంపాలని కోరింది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.