కంటోన్మెంట్ బోర్డు కాల పరిమితి మరో ఏడాది పొడిగింపు

కంటోన్మెంట్ బోర్డు కాల పరిమితి మరో ఏడాది పొడిగింపు

కంటోన్మెంట్, వెలుగు: సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ బోర్డు కాల పరిమితిని మరో ఏడాది పాటు పొడిగిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని 56 కంటోన్మెంట్​ పదవీకాలం మూడేళ్ల క్రితం ముగిసింది. పదవీకాలం ముగిసిన వెంటనే పాలక మండలికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా కొన్నికారణాల వల్ల ఎన్నికలు వాయిదా వేసిన రక్షణ మంత్రిత్వశాఖ.. గతంలో మూడేళ్ల పాటు  బోర్డు కాలపరిమితిని పెంచి  బోర్డు కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు 56 కంటోన్మెంట్ల ​బోర్డులకు నామినేటెడ్​ సభ్యులను నియమించింది.అందులో భాగంగానే సికింద్రాబాద్​ కంటోన్మెంట్  బోర్డుకు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణను నామినేటెడ్​ సభ్యునిగా నియమించింది.

మూడేళ్లుగా ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ పాలన సాగిస్తోంది. బోర్డు కాల పరిమితితో పాటు బోర్డు  నామినేటెడ్​ సభ్యుల పదవీకాలం కూడా ఫిబ్రవరి 10తో ముగియనుంది. దీంతో రక్షణ శాఖ మరో ఏడాది పాటు లేదా బోర్డు పాలక మండలి ఎన్నికలు జరిగి కొత్త మండలి ఏర్పాటు అయ్యే వరకు నామినేటెడ్​ సభ్యుడి పదవీకాలాన్ని, అధికారాలను పొడిగిస్తూ   ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఫిబ్రవరి 11 నుంచి ఏడాది పాటు లేదా కొత్త బోర్డు ఏర్పాటు అయ్యే వరకు అమలులో ఉంటాయి. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో ఇప్పట్లో బోర్డుఎన్నికలు లేనట్లే అని తేలింది.