
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా రుణమాఫీ, రైతు భరోసా ఫ్లెక్సీ తయారీని సికింద్రాబాద్‌కు చెందిన ప్రింటర్ దక్కించుకున్నారు. సర్కారు నిర్ణయించిన రేటు కంటే తక్కువగా కోట్ చేయడంతో సదరు కాంట్రాక్టర్‌కు ఈ వర్క్ దక్కింది. రుణమాఫీ, రైతు భరోసా స్కీమ్స్ అమలు చేయడం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు లబ్ధిదారుల వివరాలతో కూడిన జాబితాను గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఒక్కో గ్రామ పంచాయతీకి 6x3 సైజుల్లో మూడు ప్లెక్సీల చొప్పున ఏర్పాటు చేయడానికి అగ్రికల్చర్ ఆఫీసర్లు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక్కో ఫ్లెక్సీకి రూ. 350 చొప్పున రేటు నిర్ణయించారు. యాదాద్రి జిల్లాలోని 428 పంచాయతీలకు అవసరమయ్యే 27,309 ఫ్లెక్సీలు ప్రింట్ చేయడానికి మార్చి 22న ఆన్లైన్ టెండర్లు పిలిచారు.
ఈ లెక్కన ప్లెక్సీలను తయారు చేయడానికి రూ. 95,58,150 అవుతుంది. దీంతో సికింద్రాబాద్‌కు చెందిన భాగ్యలక్ష్మి ఫ్లెక్సీ ప్రింటర్స్, భువనగిరికి చెందిన ఎస్ఆర్ ప్లెక్సీ ప్రింటర్స్ ఆన్లైన్ లో బిడ్లు దాఖలు చేశాయి. ఈ టెండర్‌కు సంబంధించిన బాక్స్‌లను ఓపెన్ చేయగా సికింద్రాబాద్‌కు చెందిన భాగ్యలక్ష్మి ప్రింటర్స్ రూ. 91 లక్షలకు 27,309 ఫ్లెక్సీలు ప్రింట్ చేస్తామని కోట్ చేయగా, భువనగిరికి చెందిన ఎస్ఆర్ ప్రింటర్స్ రూ. 94 లక్షలకు కోట్ చేసింది. దీంతో తక్కువ కోట్ చేసిన భాగ్యలక్ష్మి ప్రింటర్స్‌కు ఆఫీసర్లు ఓకే చెప్పారు.