ఒడిశా నుంచి గంజాయి తెచ్చి..అమ్మేందుకు ఎదురుచూస్తూ..అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

ఒడిశా నుంచి గంజాయి తెచ్చి..అమ్మేందుకు ఎదురుచూస్తూ..అంతర్ రాష్ట్ర గంజాయి  ముఠా అరెస్ట్
  • 24 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు

సికింద్రాబాద్​,వెలుగు : ఒడిశా నుంచి మహారాష్ర్టకు గంజాయి తరలిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు పట్టుబడింది. నిందితుల వద్ద సుమారు రూ.6 లక్షల విలువైన 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ముఠా సభ్యుల్లో నలుగురిని అదుపులోకి తీసుకోగా.. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. బుధవారం రైల్వే అర్బన్​డీఎస్పీ జావెద్​ సికింద్రాబాద్​ రైల్వే పోలీసుస్టేషన్​లో  మీడియాకు వివరాలు వెల్లడించారు.

ఒడిశాకు చెందిన సీలు బస్తరే(29), కిరణ్ ​బాగ్​సింగ్​(26), సచిన్ ​పాల్టా సింగ్​(24) ముఠాగా ఏర్పడ్డారు. జల్సాలకు డబ్బులు సరిపోకపోతుండగా.. గంజాయి అమ్మేందుకు నిర్ణయించుకున్నారు. ఒడిశాలోని గజపతి జిల్లాలో  ఓ మారుమూల ప్రాంతంలో  తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేస్తున్నారు. మహారాష్ర్టకు చెందిన ఆటో డ్రైవర్​ షేక్​ రిజ్వాన్​(27), లక్ష్మణ్​ కాలే,  రాహుల్ ​పింబ్లేలకు సికింద్రాబాద్​లో అమ్ముతున్నారు. వీరు మహారాష్ర్టలోని అమరావతి,  పూనేకు తరలించి అధిక ధరలకు అమ్ముతూ  వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు.              

పోలీసులకు చిక్కారు ఇలా..

గంజాయి సరఫరాలో భాగంగా సీలు బస్తరే, కిరణ్​బాగ్​సింగ్, సచిన్ ​పాల్టా సింగ్​24 కిలోల గంజాయిని కొన్నారు. అదే రోజురాత్రి ఒడిశాలో నాగావళి ఎక్స్​ప్రెస్ రైలు ఎక్కి వచ్చి బుధవారం ఉదయం సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో దిగారు.  గంజాయిని షేక్ ​రిజ్వాన్,  లక్ష్మణ్ ​కాలే, రాహుల్ ​పింబ్లేకు అమ్మేందుకు ఎదురు చూస్తున్నారు. రైల్వే ఎస్ఐ మాజీద్ ​సిబ్బందితో కలిసి సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో తనిఖీలు చేపట్టగా.. ఫాట్ ఫామ్ నం. 7 వద్దకు రాగానే ముగ్గురు వ్యక్తులు మూడు బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించారు.

పోలీసులు వెళ్లి బ్యాగులను తనిఖీ చేయగా అందులో 24 కిలోల గంజాయి లభించింది. దీంతో  వారిని అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే గంజాయిని తీసుకువెళ్లేందుకు వచ్చిన సీలు బస్తరే పోలీసులకు దొరికాడు.  కిరణ్​బాగ్​సింగ్, సచిన్ ​పాల్టాసింగ్  తప్పించుకుని పారిపోయారు.  ముఠా సభ్యుల్లో నలుగురిని అరెస్టు చేయగా.. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు రైల్వే డీఎస్పీ జావెద్ ​తెలిపారు.