గంజాయి పెడ్లర్​కు పోలీసుల ట్రాప్

గంజాయి పెడ్లర్​కు పోలీసుల ట్రాప్
  • సరుకు దొరికినా.. అక్కడే వదిలేశారు
  • ఆ తర్వాత మాటు వేసి నిందితుడిని పట్టుకున్నరు

పద్మారావునగర్, వెలుగు: అంతరాష్ట్ర గంజాయి ముఠాలోని ఒక సభ్యుడిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాకు చెందిన సమీరా బిషోయ్, మున్నా నాయక్ స్నేహితులు. వీరిద్దరూ ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి, మహారాష్ట్రలో అధిక ధరకు అమ్ముతున్నారు. అందులో భాగంగా ఈ నెల 16న ట్రాలీ సూట్​కేసులో 12 ప్యాకెట్ల గంజాయి నింపులోని మహారాష్ట్రలోని దాదార్ వెళ్లేందుకు బెర్హంపూర్ రైల్వే స్టేషన్​లో కోణార్క్ ఎక్స్ ప్రెస్​ఎక్కారు.

నేరుగా దాదర్ వెళ్లే మార్గంలో పోలీసుల తనిఖీలు ఎక్కువగా జరుగుతున్నాయని, బుధవారం ఉదయం సికింద్రాబాద్​లో దిగారు. దాదర్ వెళ్లే రైలు మధ్యాహ్నం ఒంటిగంటకు ఉండడంతో స్టేషన్ లో  వేచి ఉన్నారు. ఇదే సమయంలో  రైల్వే పోలీసులు స్టేషన్ లో తనిఖీలు నిర్వహించడాన్ని గమనించి, సూట్ కేసును ప్లాట్ ఫామ్ పై  వదిలి ఉడాయించారు. అయితే, పోలీసులు సూట్ కేసును చెక్ చేసి, అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు.

ఆ తర్వాత సూట్ కేసును అక్కడే వదిలేసిన నిందితుల కోసం కాపు కాశారు. కాగా, మున్నా నాయక్, సమీరా బిషోయ్ ఇద్దరు కలిసి మధ్యాహ్నం ఒంటిగంటకు స్టేషన్ కు చేరుకుని చూడగా, తమ సూట్ కేసు ప్లాట్ ఫామ్ పైనే ఉండడాన్ని గుర్తించారు. దాదర్ వెళ్లేందుకు దేవగిరి ఎక్స్ ప్రెస్  7వ ప్లాట్ ఫామ్ కు వస్తుందని తెలుసుకొని, 6వ ప్లాట్ ఫామ్ పై ఉన్న ట్రాలీ సూట్​కేసును బిషోయ్ తీసుకుని వెళ్తుండగా, అప్పటికే మాటువేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇది దూరం నుంచి గమనించిన మున్నా నాయక్ అక్కడ నుంచి పారిపోయాడు. సమీరా బిషోయ్ వద్ద ఉన్న 12.31 కిలో ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

మరో రెండు కేసుల్లో 26 కేజీలు..

మెహిదీపట్నం: ఒడిశా నుంచి దిగుమతి చేసుకొని, ధూల్‌పేటలో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని ఎస్టీఎఫ్ ఏ టీమ్ సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడిని ఆకాశ్ సింగ్​గా​గుర్తించి, ధూల్‌పేట ఎక్సైజ్ పీఎస్​లో అప్పగించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న లఖన్‌ సింగ్‌, సంజయ్‌ సింగ్‌, జ్యోతి బాయ్‌, ఆనంద్‌ సింగ్‌, మణిశ్ సింగ్‌, దీప, నిరంజన్‌ కుమార్‌పై కేసులు నమోదు చేశారు.

అలాగే జియాగూడ పీలా కాశీ శివమందిర్‌ సమీపంలో గంజాయి అమ్ముతున్న భద్రినారాయణ్‌ సింగ్‌ను అరెస్టు చేశారు. ఈ కేసుతో అజయ్‌సింగ్‌, మంజులా దేవికి సంబంధం  ఉండడంతో వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు టీమ్ లీడ్ అంజిరెడ్డి తెలిపారు. ఈ రెండు కేసుల్లో మొత్తం 26.7 కేజీల గంజాయి సీజ్ చేశామన్నారు.