సికింద్రాబాద్: రైల్వే ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న దొంగను రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చోరీలకు అలవాటుపడ్డ లింగప్ప అనే వ్యక్తి రైళ్లలో కిటికీల వద్ద, పుట్ బోర్డింగ్లో ప్రయాణించే వారే టార్గెట్గా సెల్ ఫోన్లను లాక్కొని పరార్ అవుతున్నాడు. కొద్ది రోజుల క్రితం దినేష్ అనే ప్రయాణికుడి సెల్ ఫోన్ లాగడంతో రైలు చక్రాల కింద పడి చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగ లింగప్పపై మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లాలాగూడ రైల్వే ట్రాక్ దగ్గర బుధవారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న లింగప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి దినేష్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని, అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో కేసులో ఆర్పీఎఫ్ జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ప్లాట్ ఫామ్ నెంబర్ 10లో 10 కిలోల గంజాయి పట్టుబడింది.
అనుమానాస్పదంగా కనిపించిన అమెరికన్ టూరిస్టర్ పేరు ఉన్న బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్ తెరిచి చూడగా అందులో ఐదు ప్యాకెట్ల ఎండు గంజాయి లభించింది. దీని విలువ సుమారు రెండు లక్షల అరవై వేలు ఉంటుందని జీఆర్పీ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.