లష్కర్​ బోనాల జాతర ఇయ్యాల్నే

లష్కర్​ బోనాల జాతర ఇయ్యాల్నే
  •     పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం, మంత్రులు
  •     బంగారు బోనం సమర్పించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్​
  •     24 ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా 175 బస్సులు
  •     1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు

హైదరాబాద్, వెలుగు :  సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం బోనాల వేడుకులకు సిద్ధమైంది. ఆదివారం తెల్లవారు జామున తొలిపూజ జరగనుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి మొదటగా బంగారు బోనం సమర్పించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఇతర మంత్రులు, సీఎస్​శాంతి కుమారి, గవర్నర్​రాధాకృష్ణన్, సీజే, ఇతర జడ్జిలు అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఉత్సవాలకు దాదాపు పది లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.1,500 మంది పోలీసులు, వంద సీసీ కెమెరాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

భక్తుల కోసం ఆరు క్యూలైన్లు, వీఐపీలకు ప్రత్యేక క్యూలైన్లు, సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా జనరల్​ క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం స్పెషల్​వెహికల్స్​అందుబాటులో ఉంచారు. ఆర్టీసీ 24 ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా 175 బస్సులు నడుపుతోంది. రెండు రోజులపాటు ఆలయానికి 2కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ఆంక్షలు విధించారు. సోమవారం ఉదయం మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నిలబడి రంగం(భవిష్యవాణి) వినిపించనున్నారు. అనంతరం కర్ణాటక నుంచి ఉత్సవాల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన రూపవతి(ఏనుగు)పై అమ్మవారి ఊరేగింపు జరగనుంది. 

బోనమెత్తిన దీపాదాస్​ మున్షీ

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​చార్జ్ దీపాదాస్​ మున్షీ శనివారం ఉజ్జయిని మహంకాళికి బోనమెత్తారు. పీసీసీ జనరల్ సెక్రటరీ కోట నీలిమతో అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులతో కలిసి ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.