గతేడాది రంగంలో అమ్మవారు భవిష్యవాణిని బాగా చెప్పారు. అంతా బాగుంటుందని చెప్పారు. అలాగే జరిగింది. మరి ఈసారి అమ్మవారు ఏం చెబుతారో అని భక్తులు ఎదురుచూస్తున్నారు. రేపు సోమవారం ( జులై22) రంగం కార్యక్రమం సందర్భంగా సికింద్రాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనాన్ని అమ్మవారికి ఈ రోజు ( జులై 21) సమర్పించారు. కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి, అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు.ఆ తరువాత సీఎం రేవంత్ రెడ్డి, అమ్మవారిని దర్శించుకొని, బోనాలు సమర్పించారు.
ట్రాఫిక్ ఆంక్షలు
సాధారణంగానే సికింద్రాబాద్ అమ్మవారి ఆలయ ప్రాంతం రద్దీగా ఉంటుంది.ఉజ్జయినీ మహంకాళీ బోనాల సమయంలో మరింత రద్దీగా ఉంది. ఈ కారణంగా 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి 2 కిలోమీటర్ల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంచారు.
భక్తుల వాహనాల పార్కింగ్ ఎక్కడంటే:
ఆలయానికి వాహనాలపై వచ్చే భక్తులు… హరిహర కళా భవన్, మహబూబ్ కాలేజ్, ఓల్డ్ జైల్ ఖానా ఓపెన్ ప్లేస్, ఇస్లామియా హైస్కూల్, గవర్నమెంట్ అదయ్య మెమోరియల్ హైస్కూల్, అదయ్య క్రాస్ రోడ్స్, రాణిగంజ్, సికింద్రాబాద్, మహాత్మాగాంధీ విగ్రహం, MG రోడ్, బెల్సన్ తాజ్‌హోటల్, అంజలి థియేటర్, పరేడ్ గ్రౌండ్‌లో వాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం అక్కడ ప్రత్యేక స్థలాలను పోలీసులు ఎరేంజ్ చేశారు.
వాహనదారులకు అలర్ట్:
కర్బలా మైదాన్, రాణిగంజ్, రాంగోపాల్‌పేట్ ఓల్డ్ పీఎస్, ప్యారడైజ్, సంగీత్ క్రాస్ రోడ్స్, ప్యాట్నీ క్రాస్ రోడ్స్, పార్క్‌లేన్, బాటా, బైబిల్ హౌస్, మినిస్టర్ రోడ్, రసూల్‌పురా వైపు వచ్చే వాహనదారులు ఇతర మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
రంగంపై ఆసక్తి:
ప్రతీ సంవత్సరం ఈ బోనాల ఉత్సవాల్లో రంగం జరపడం ఆనవాయితీ. అమ్మవారి వేషధారణలో ఉన్న మహిళ భవిష్యవాణి చెబుతారు. దీన్ని భక్తులు ఎంతో శ్రద్ధతో తెలుసుకుంటారు. గతేడాది రంగంలో స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. అంతా బాగుంటుందనీ, తనను బాగా చూసుకోవాలని కోరారు. తాను భక్తులను చూసుకుంటానని అన్నారు. దాంతో అంతా బాగానే జరిగింది. ఈ సంవత్సరం ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి అమ్మవారు రంగంలో ఏం చెబుతారో అనే ఆసక్తి ఉంది.