- వెపన్స్ తయారీ మెషీన్, డిటోనేటర్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం
- చత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్ జిల్లాలో ఘటన
భద్రాచలం, వెలుగు: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లాలో డీఆర్జీ, బీఎస్ఎఫ్ జవాన్లు కూంబింగ్‌లో భాగంగా శనివారం మావోయిస్టుల శిబిరాన్ని ధ్వంసం చేశారు. ఈ శిబిరంలో ఆయుధాలు తయారు చేసే మెషీన్లు, గ్యాస్, ఆక్సిజన్సిలిండర్లు, డిటోనేటర్లు, భారీగా పేలుడు పదార్థాలు, సోలార్ ప్లేట్లు, పెద్ద పెట్టె, కిట్ బ్యాగులు, విప్లవ సాహిత్యం, నిత్యావసర సరుకులు స్వాధీనం చేసుకున్నారు.
బస్తర్ ఐజీ సుందరరాజ్ పి కథనం ప్రకారం.. మావోయిస్టులు భారీగా సమావేశం అయ్యారనే పక్కా సమాచారంతో నారాయణ్‌పూర్ జిల్లాలోని సోనాపూర్, కోహ్కాపేట పోలీస్స్టేషన్ల పరిధిలోని కోంగే, కాందూల్ఫాడు, పాంగ్డు గ్రామ పరిసర అటవీ ప్రాంతాల్లో డీఆర్జీ, బీఎస్ఎఫ్ జవాన్లను రంగంలోకి దించారు. వీరు రెండు రోజులుగా అడవులను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో పాంగ్డు గ్రామ అడవుల్లో మావోయిస్టుల కదలికలను గుర్తించారు. జవాన్లను చూసిన మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. శిబిరాన్ని చుట్టుముట్టిన జవాన్లు మావోయిస్టుల డంపును స్వాధీనం చేసుకున్నారు.
అంగన్వాడీ కార్యకర్త హత్య
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక మావోయిస్టులు అంగన్వాడీ కార్యకర్తను కత్తులతో పొడిచి చంపారు. ఈ హత్య ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. బాసగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా పని చేస్తున్న పద్దం లక్ష్మిని గతంలో రెండు సార్లు మావోయిస్టులు హెచ్చరించారు. పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో సాధారణ వ్యక్తుల్లా వచ్చిన మావోయిస్టులు ఆమెను బయటకు పిలిచి తీవ్రంగా కొట్టారు.
కొడకు అడ్డుపడగా, అతడిని కూడా తీవ్రంగా కొట్టి గాయపరిచారు. తర్వాత కత్తులతో కొడుకు ముందే పద్దం లక్ష్మిని మావోయిస్టులు పొడిచి చంపేశారు. బైరంగఢ్ మావోయిస్టు ఏరియా కమిటీ పేరిట లేఖను వదిలి వెళ్లారు. తీరుమార్చుకోవాలని హెచ్చరించినా వినకుండా పోలీసులకు తమ ఆచూకీ ఎప్పటికప్పుడు చెబుతుందని, వారిని కలుస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆమె ఇల్లు గ్రామంలోని సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపునకు కొద్ది దూరంలోనే ఉండడం గమనార్హం. విషయం తెలుసుకున్న బాసగూడ పోలీసులు ఆమె డెడ్‌బాడీని ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం గ్రామస్తులకు అందజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.