భద్రాచలం,వెలుగు: చత్తీస్గఢ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా నక్సలైట్లు సహా ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను, ఆరు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్ పి తెలిపారు. ఆదివారం సాయంత్రం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
కాంకేర్ జిల్లా టేకామేటా అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని డీఆర్జీ, ఎస్టీఎఫ్, బీఎస్‌ఎఫ్‌జవాన్లు ఛోటేబేటియా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మృతులను గుర్తించాల్సి ఉందని ఐజీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో ఒక ఇన్సాస్, ఎస్ఎల్ఆర్ రైఫిల్1, 12 బోర్ రైఫిల్స్ 3, బీజీఎల్ 1 ఉన్నాయి. బలగాలు ఇంకా అబూజ్మాఢ్ ఏరియాలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.