
హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దు్ల్లో సాగుతోన్న ఆపరేషన్ కర్రె గుట్టల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ఐదు రోజులుగా ముమ్మురంగా సాగుతోన్న సెర్చ్ ఆపరేషన్‌లో భద్రతా దళాలు కీలక పురోగతి సాధించాయి. మావోయిస్టుల కంచకోట అయినా కర్రెగుట్టల్లో నక్సలైట్ల భారీ బంకర్‌ను భద్రతా దళాలు గుర్తించాయి. దాదాపు వెయ్యి మంది ఉండేలా నిర్మించిన భారీ గుహను సెక్యూరిటీ ఫోర్సెస్ కనిపెట్టాయి. ఈ గుహలో నీటి సౌకర్యం కూడా ఉన్నట్లు గుర్తించారు. భద్రతా బలగాల రాకను ముందేగానే పసిగట్టిన మావోయిస్టులు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు.
కర్రెగుట్టల్లో గుర్తించిన గుహ విజువల్స్‌ను భద్రతా బలగాలు విడుదల చేశాయి. అయితే.. ఇలాంటి గుహలు కర్రె గుట్టల్లో అనేకం ఉండటంతో భద్రతా బలగాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న కర్రెగుట్టలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్‌ను కంటిన్యూ చేస్తున్నాయి. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య పరస్పర కాల్పులతో కర్రెగుట్టలు దద్దరిల్లుతున్నాయి. తుపాకీ తూటాల మోతతో కర్రెగుట్టల సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురైతున్నారు.
2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేయాలని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇందు కోసం ఆపరేషన్ కగార్ చేపట్టింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో మావోయిస్టు పార్టీ కీలక నేత హిడ్మాతో పాటు మరో వెయ్యి మందికి పైగా నక్సలైట్లు ఉన్నట్లు భద్రతా దళాలకు నిఘావర్గాల నుంచి సమాచారం అందింది.
దీంతో కర్రెగుట్టలో ఐదు రోజుల నుంచి కేంద్ర, రాష్ట్ర బలగాలు కూంబింగ్ చేపట్టాయి. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర మూడు వైపుల నుంచి కర్రెగుట్టలను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. హిడ్మాతో పాటు మరికొందరు కీలక నేతలే లక్ష్యంగా భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా దళాలు, మవోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులతో కర్రెగుట్టలు తుటాల మోతతో దద్దరిల్లుతున్నాయి.
శనివారం (ఏప్రిల్ 26) భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 28 మంది నక్సలైట్లు హతమైనట్లు సమాచారం. దీనిపై అధికారులు, ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఛత్తీస్గడ్, తెలంగాణా సరిహద్దు కర్రెగుట్టల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఏ క్షణాన ఏ జరుగుతుందోనని సమీప గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
మరోవైపు కర్రెగుట్టల్లో కేంద్ర, రాష్ట్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయాలని ఇప్పటికే మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని.. నెలరోజుల పాటు ఆపరేషన్ కగార్ ఆపాలని విజ్ఞప్తి చేసింది. మావోయిస్టు పార్టీ అభ్యర్థనను ఏ మాత్రం లెక్కచేయని భద్రత దళాలు నక్సలైట్ల ఏరివేత లక్ష్యంగా కర్రెగుట్టల్లో ముందుకు వెళ్తున్నాయి.