- మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మైనార్టీ గురుకులంలో ఘటన
బెల్లంపల్లి, వెలుగు : ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలిక పట్ల సెక్యూరిటీ గార్డు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మైనార్టీ గురుకులంలో సోమవారం జరిగింది. ఉదయం 7 గంటలకు స్కూల్ ఆవరణలో ఉన్న బాలిక వద్దకు ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డు నిహాల్ వెళ్లాడు. బాలిక చేయి పట్టుకొని అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాలిక వెంటనే ప్రిన్సిపాల్ షబానా అన్సారీకి ఫిర్యాదు చేసింది.
ఆమె 100కు ఫోన్ చేయడంతో బ్లూ కోల్ట్స్ పోలీసులు స్కూల్‌కు చేరుకొని ఘటనకు బాలిక నుంచి వివరాలు సేకరించారు. అనంతరం బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు స్కూల్‌కు వచ్చి తమ కూతురికి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ షబానా అన్సారి మాట్లాడుతూ విషయాన్ని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో సెక్యూరిటీ గార్డ్ పై కేసు నమోదు చేసినట్లు బెల్లంపల్లి పోలీసులు తెలిపారు.