సిద్ధిఖీ హత్యతో రాజకీయవర్గాలతోపాటు బాలీవుడ్ కూడా ఉలిక్కిపడింది. సిద్ధిఖీకి సన్నిహితుడైన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు ముప్పు పొంచి ఉన్నదనే వార్తలు వెలువడ్డాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లో సల్మాన్ ఖాన్ పేరును ప్రస్తావించింది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అనుజ్ థాపన్తో సిద్ధిఖీకి ఉన్న సాన్నిహిత్యమే ఆయన హత్యకు కారణమని పేర్కొంది. సల్మాన్ ఖాన్, దావూద్ గ్యాంగ్‌కు ఎవరు సహాయం చేసినా మూల్యం చెల్లించుకోవాల్సిందే అని హెచ్చరించారు.
దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర సర్కారు సల్మాన్ ఖాన్‌కు భద్రత పెంచింది. ఆయన కుటుంబ సభ్యులకు కూడా భద్రతను పెంచింది. ఈ నేపథ్యంలో తన సినిమా షూటింగ్ షెడ్యూల్స్ తో పాటు వ్యక్తిగత మీటింగ్లన్నింటనీ సల్మాన్‌ఖాన్ రద్దు చేసుకున్నారు. కాగా, ఆదివారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి సిద్ధిఖీ ఇంటికి సల్మాన్‌ఖాన్ వెళ్లారు. సిద్ధిఖీకి నివాళి అర్పించి, బాంద్రాలోని తన ఇంటికి చేరుకొన్నారు.