మరోసారి వరల్డ్ కప్ షెడ్యూల్‌లో మార్పులు.. ఈసారి హైదరాబాద్ పోలీసుల వంతు

మరోసారి వరల్డ్ కప్ షెడ్యూల్‌లో మార్పులు.. ఈసారి హైదరాబాద్ పోలీసుల వంతు

వన్డే ప్రపంచ కప్‌‌ను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. సమయం దగ్గరపడతున్న కొద్దీ షెడ్యూల్‌లో మార్పులు చేయాలంటూ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్‌లు బీసీసీఐకి లేఖలు పంపుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్( హెచ్‌సీఏ)..  ఉప్పల్‌ వేదికగా జరగనున్న పాక్-శ్రీలంక మ్యాచ్‌ షెడ్యూల్‌ను మార్చాలని బీసీసీఐని కోరింది.

ఉప్పల్‌ వేదికగా 3 మ్యాచ్‌లు

ఈ మెగా టోర్నీలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్‌ 6న  పాకిస్థాన్ vs నెదర్లాండ్స్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా, అక్టోబర్ 9న న్యూజిలాండ్ vs నెదర్లాండ్స్‌, అక్టోబర్ 10న పాకిస్థాన్ vs శ్రీలంక జట్లు తపడనున్నాయి.

సెక్యూరిటీ కష్టాలు

ఒకవైపు అక్టోబర్‌లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడం, మరోవైపు వరుస రోజుల్లో మ్యాచ్‌ల నిర్వహణపై హైదరాబాద్‌ పోలీసులు భద్రతాపరమైన ఆందోళనను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రెండు మ్యాచుల మధ్య కనీసం ఒక్క రోజైనా గడువు  ఉండాలని పోలీసులు  భావిస్తున్నారు. ఈ విషయాన్ని వారు ఇప్పటికే హెచ్‌సీఏ దృష్టికి తీసుకెళ్లగా..అక్కడినుండి బీసీసీఐకి చేరినట్లు తెలుస్తోంది.

తొలి షెడ్యూల్‌ ప్రకారం శ్రీలంక- పాక్ మ్యాచ్‌ అక్టోబర్ 12న జరగాల్సింది. కానీ ఇండియా - పాక్‌ మ్యాచ్‌ను అక్టోబర్ 14కి రీషెడ్యూల్‌ చేయడంతో.. పాకిస్థాన్‌ జట్టుకు తగినంత సమయం ఇవ్వడానికి లంకతో జరగాల్సిన మ్యాచ్‌ను అక్టోబర్ 10కి మార్చారు. అలాగే కోల్‌కతా వేదికగా జరగనున్న పాక్‌ - ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ కూడా నవంబర్ 12కి బదులు నవంబర్‌ 11న నిర్వహించేలా రీషెడ్యూల్‌ చేశారు. హెచ్‌సీఏ విజ్ఞప్తిపై బీసీసీఐ, ఐసీసీ ఏ విధంగా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ షెడ్యూల్‌లో మార్పులు చేయడం కుదరకపోతే మరొక చోటికి తరలించవచ్చన్న మాటలు కూడా వినపడుతున్నాయి.