- రెండ్రోజుల్లో 2 మ్యాచ్‌లకు సెక్యూరిటీ ఇవ్వలేమంటున్న పోలీసులు!
- షెడ్యూల్ మార్చాలని బీసీసీఐకి హెచ్‌సీఏ రిక్వెస్ట్
- ఇప్పుడు కుదరదంటున్న బోర్డు వైస్ ప్రెసిడెంట్ శుక్లా
హైదరాబాద్ : వన్డే వరల్డ్ కప్‌లో హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌లకు భద్రతా కష్టాలు మొదలయ్యాయి. అక్టోబర్ 9,10న వరుసగా రెండు రోజుల్లో రెండు మ్యాచ్‌లకు భద్రత కల్పించడం కుదరదని హైదరాబాద్ పోలీసులు.. ఆతిథ్య హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు తెలిపారు. ఇదే విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లిన హెచ్‌సీఏ షెడ్యూల్‌ను మార్చాలని కోరినట్టు తెలుస్తోంది. ఐసీసీ, బీసీసీఐ ఇండియా-–పాక్ మ్యాచ్ సహా వరల్డ్ కప్‌లో తొమ్మిది మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేశాయి. అక్టోబర్15న అహ్మదాబాద్‌లో జరగాల్సిన ఇండో–పాక్ పోరును ఒకరోజు ముందుకు జరిపాయి. ఈ కారణంగా పాకిస్తాన్–శ్రీలంక మధ్య హైదరాబాద్ అక్టోబర్ 12న షెడ్యూల్ చేసిన మ్యాచ్‌ను అక్టోబర్10కి మారింది.
అయితే, అంతకు ఒక రోజు ముందు అక్టోబర్ 9న ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్–నెదర్లాండ్స్మ్యాచ్ జరగనుంది. ఇలా రెండ్రోజుల్లో రెండు మ్యాచ్‌లకు భద్రత ఇవ్వడం కష్టమని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేయడంతో ఇదే విషయాన్ని హెచ్‌సీఏ బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. సాధారణంగా ఓ ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు 2000-–2500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తారు. పాక్ ఆడుతుండటంతో భారీ సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది.పైగా ఉప్పల్‌లో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడనున్న పాక్ సిటీలో పది రోజులపైనే ఉండనుంది.
ఈ విషయాలన్నింటినీ బోర్డు దృష్టికి తీసుకెళ్తున్నామని హెచ్‌సీఏ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కానీ, షెడ్యూల్ మార్పు ఇప్పుడు దాదాపు అసాధ్యమని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అంటున్నారు. ‘వరల్డ్‌కప్‌లో హైదరాబాద్ వేదికను నేనే పర్యవేక్షిస్తున్నా. ఈ టైమ్‌లో షెడ్యూల్ మార్పు కష్టం. బీసీసీఐ మాత్రమే షెడ్యూల్‌ను మార్చదు. ఈ విషయంలో జట్లు, ఐసీసీ, ఇతర వాటాదారులు కూడా భాగమై ఉంటారు’ అని పేర్కొన్నారు.