
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొయిల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి వద్ద భారీగా భద్రతను పెంచింది. అలాగే.. ఔరంగజేబు సమాధి వద్దకు వెళ్లే సందర్శకులపైన ఆంక్షలు విధించింది. సందర్శకులందరికీ ఐడి ధృవీకరణ తప్పనిసరి అని అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలోని మొఘల్ రాజు ఔరంగజేబు సమాధి కూల్చేయాలని గత కొద్ది రోజులుగా విశ్వహిందు పరిషత్ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన వీహెచ్పీ బృందం జౌరంగజేబు సమాధిని తొలగించాలని వినతిపత్రం ఇచ్చింది.
ఔరంగజేబు స్మారక చిహ్నం బాధ, బానిసత్వానికి ప్రతీకని.. అలాంటి సమాధిని వెంటనే తొలగించాలి.. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే మేమే సమాధిని కూల్చేస్తామని వీహెచ్పీ హెచ్చరికలు జారీ చేసింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్, గురు గోవింద్ సింగ్ ఇద్దరు కుమారులను ఉరితీయాలని ఔరంగజేబు ఆదేశించాడని.. అలాంటి పాలకుడి స్మారక చిహ్నం ఉనికిలో ఉండకూడదని వీహెచ్పీ వాదిస్తోంది.
ఔరంగజేబు మరాఠాలు, సిక్కులను హింసించడంతో పాటు కాశీ, మధుర, సోమనాథ్‌లోని దేవాలయాలను నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఔరంగజేబు సమాధి కూల్చేయాలనే డిమాండ్లు రోజు రోజుకు మరింత ముదురుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో ఔరంగజేబు సమాధి ఉన్న ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించి.. పలు ఆంక్షలు విధించింది.
1707లో మరణించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ నగర్ జిల్లా ఖుల్దాబాద్‌లో ఖననం చేశారు. మొఘల్ రాజులు ఢిల్లీ కేంద్రంగా పరిపాలన చేయగా.. ఔరంగజేము మాత్రం తన చివరి రోజుల్లో మహారాష్ట్రలో గడిపారు. దీంతో అతడి స్మారక చిహ్నం మహారాష్ట్రలోనే నిర్మించారు. ఔరంగజేబు సమాధిని నిత్యం భారీగానే జనం సందర్శించుకుంటారు. శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీని ఔరంగజేబు దారుణంగా హత్య చేయించాడు.
ఈ కథ ఆధారంగానే.. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో ఇటీవల ఛావా సినిమా తెరకెక్కింది. ఔరంగజేబు సమాధి తొలగించాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నా.. ఇటీవల ఛావా మూవీ విడుదల తర్వాత ఈ డిమాండ్లు మరింత ఎక్కువ అయ్యాయి. దీంతో ఔరంగజేము సమాధి ఉన్న ప్రాంతంలో ప్రభుత్వం భద్రత పెంచింది. 50 మంది రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది, 30 మంది స్థానిక పోలీసు అధికారులు, 20 మంది హోమ్ గార్డులతో కూడిన ఒక కంపెనీని అక్కడ మోహరించారు. సందర్శకులు ఇప్పుడు ఆ ప్రదేశంలోకి ప్రవేశించే ముందు వారి పేర్లను నమోదు చేసుకోని గుర్తింపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.