ఏపీ 34 టీఎంసీలకు మించి తీసుకోకుండా చూడండి

  • కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

హైదరాబాద్‌: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి తెలంగాణ ప్రభుత్వం గురువారం లేఖ రాసింది. కృష్ణా జలాల్లో ఏపీ ప్రభుత్వం 34 టీఎంసీలకు మించి తీసుకోకుండా చూడాలని ప్రభుత్వం తరపున ఈఎన్‌ఎసీ మురళీధర్‌ లేఖ రాశారు. అది కూడా శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం 880 అడుగులకు పైబడి ఉన్నప్పుడే ఏపీ ప్రభుత్వం 34 టీఎంసీల నీరు తీసుకునేలా చూడాలని ఆయన కోరారు. అంతేకాదు ఏపీ ప్రభుత్వం చేపట్టిన అన్ని ప్రాజెక్టులను గెజిట్ లో చేర్చాలని, ప్రాజెక్టు పనులను గెజిట్ రెండో షెడ్యూల్ లో చేర్చాలని కోరారు.  
పోతిరెడ్డిపాడు ద్వారా 11,150 క్యూసెక్కుల వరకే నీటిని విడుదల చేసేందుకు డిజైన్‌ చేశారని, శ్రీశైలం కుడి ప్రధాన కాలువను 20వేల క్యూసెక్కులకు పెంచారని ఈఎన్ సీ తెలిపారు. ఏపీకి వరద సమయాల్లో జూలై, అక్టోబర్‌ మధ్య మాత్రమే నీరు వదలాలని, 34 టీఎంసీలకు మంచి తీసుకోవడానికి జలసంఘం అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. శ్రీశైలం నుంచి వెంటనే నీటి విడుదల ఆపాలని, పోతిరెడ్డిపాడు విస్తరణ, ఎస్‌ఆర్‌ఎంసీలను అనుమతులు లేని ప్రాజెక్టులుగా పేర్కొనాలని కృష్ణా బోర్డుకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.