స్పెషల్ : ప్రకృతిని కాపాడేందుకు సీడ్​బాల్స్​!

 స్పెషల్ : ప్రకృతిని కాపాడేందుకు సీడ్​బాల్స్​!

అడవులు, చెట్లు నరికివేయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతోంది. ఈ విషయం అర్థం కావడానికి మన కళ్ల ముందు సజీవంగా ఎన్నో రుజువులు ఉన్నాయి. ఈమధ్య కేరళ, వయనాడ్​లో కొండచరియలు విరిగిపడడం, వరదలు ముంచెత్తడం వంటివి ఇందుకు నిదర్శనం అని చెప్పొచ్చు. పర్యావరణానికి నష్టం కలిగించకుండా నా వంతు ప్రయత్నం ఏమైనా చేయాలి అనుకున్నాడు  లక్కరసు ప్రభాకర వర్మ. దాంతో సీడ్​ బాల్స్​ తయారుచేసి ఉచితంగా పంచుతున్నాడు. వాటిని అడవులు, గుట్టలు,  ఖాళీ ప్రదేశాలు, రోడ్ల పక్కన చల్లుతూ చెట్లు సహజంగా పెరిగేందుకు  తోడ్పాటు నందిస్తున్నాడు.

సిద్దిపేట జిల్లా రావురూకల గ్రామానికి చెందిన ప్రభాకర వర్మ సీడ్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఆ ఉద్యోగంలో భాగంగా వివిధ ప్రాంతాలకు వెళ్లేవాడు. అప్పుడు పెద్ద చెట్లను నరికివేయడం కనిపించింది. అది చూసి తీవ్ర ఆవేదన చెందేవాడు. ఒక్కో చెట్టు పెరగాలంటే దశాబ్దాలు పడుతుంది. అలాంటిది వెనకాముందు ఆలోచించకుండా ఇష్టారాజ్యంగా నరికివేస్తున్నారు. అలాగని ప్రత్యామ్నాయంగా మళ్లీ మొక్కలు నాటడం లేదు. ఈ పరిస్థితికి చెక్​ పెట్టడం ఎలా అని ఆలోచించాడు. అప్పుడు అతనికి సీడ్ బాల్స్ రూపంలో ప్రత్యామ్నాయం దొరికింది. ఆ ఆలోచన రావడం ఆలస్యం సీడ్​బాల్స్​ తయారుచేసి, వాటిని అడవుల్లో చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.

నవసమాజ నిర్మాణ సమితి

ఆ కార్యక్రమంలో భాగంగా తన ఫ్రెండ్స్​, తెలిసిన వాళ్లు, బంధువులతో కలసి ఎనిమిదేండ్ల  క్రితం ‘నవ సమాజ నిర్మాణ  సమితి’ని మొదలుపెట్టాడు. దానిద్వారా చెట్లు పెంచాలని ప్లాన్​ చేశాడు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ సంస్థ సభ్యులకు సీడ్​బాల్స్​తయారుచేసి ఉచితంగా ఇచ్చాడు. వాటిని రోడ్ల పక్కన, అడవుల్లో, ప్రభుత్వ స్థలాల్లో చల్లడం మొదలుపెట్టారు. బెంగళూరు నుండి విత్తనాలను తెప్పించి సీడ్ బాల్స్ తయారుచేస్తున్నారు. అందుకు ప్రతి ఏటా కొంత డబ్బు ఖర్చు పెడుతున్నారు. దోమకొండకు చెందిన ‘లైఫ్’ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు దేవరగట్టు బాల ఈ కార్యక్రమంలో సాయం చేస్తున్నాడు.

విత్తనాలు పలు రకాలు 

 సీడ్​బాల్స్ తయారీలో మర్రి, మారేడు, వేప, రావి, జువ్వి, చింత, ఉసిరి, సీమచింత, మామిడి లాంటి విత్తనాలు ఎక్కువగా వాడతారు. మట్టి, పేడలో గోమూత్రం కలిపి బాల్స్ తయారుచేస్తారు. వాటిలో ఒక్కో విత్తనాన్ని ఉంచుతారు. పేడ, గోమూత్రాలను కామారెడ్డి సమీపంలోని గోశాల నుంచి తెస్తారు. ఈ సీడ్ బాల్స్ రెండేండ్ల వరకు చెడిపోవు. వర్షాలు మొదలయ్యాక సీడ్​బాల్స్​ను పలు ప్రాంతాల్లో చల్లొచ్చు. వాన నీళ్లకు ఆ బాల్స్​పైన ఉన్న మట్టి కరిగిపోయి విత్తనాలు సహజ సిద్ధంగా మొలకెత్తుతాయి. మొలకెత్తిన మొక్కలకు ప్రత్యేకంగా కేర్​ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పటివరకు మేం వేసిన సీడ్​బాల్స్​లో మొక్కలు 70 శాతానికి పైగా బతకడమే అందుకు నిదర్శనం. ఈ పద్ధతి వల్ల చెట్లు పెరుగుతాయి. అడవులు పెంచొచ్చు. దాంతో కాలుష్యం తగ్గుతుంది. వర్షపాతం సమంగా ఉంటుంది. పశుపక్ష్యాదులకు ఆహారం దొరుకుతుంది. అదికూడా సహజ సిద్ధంగా.

- హెచ్.రఘునందన్ స్వామి, సిద్దిపేట 

ప్రత్యేక శిక్షణ

ప్రత్యేకమైన మట్టి, పలు రకాల విత్తనాలతో సీడ్​బాల్స్​ తయారుచేస్తారు. వీటి తయారీలో శిక్షణ పొందిన నవ సమాజ సమితి  సభ్యులు, యువకులు, విద్యార్థులతో పాటు ప్రకృతి ప్రేమికులు కూడా పాల్గొంటారు. దోమకొండ, కామారెడ్డి  గురుకుల పాఠశాల విద్యార్థులతో రెగ్యులర్​గా సీడ్ బాల్స్ తయారు చేయిస్తుంటారు. రాష్ట్రంలోని కొన్ని పాఠశాలలు సీడ్​బాల్స్​ తయారీ గురించి స్టూడెంట్స్​కు ట్రైనింగ్​ ఇప్పిస్తున్నాయి. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఖాళీ టైంలో సీడ్ బాల్స్ తయారుచేసి, వాటిని ఆరబెట్టి  నవ సమాజ సమితి సభ్యులకు ఇస్తారు. సమితి సభ్యులు అడవులు, రోడ్ల పక్కన వాటిని చల్లుతారు. ఈ ఎనిమిదేండ్ల కాలంలో దాదాపు పది లక్షల సీడ్​బాల్స్ తయారుచేసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో, రోడ్ల పక్కన, గుట్టల పైన, అడవుల్లో చల్లారు. 

చిరు ప్రయత్నం ఇది...

పర్యావరణ హితం కోసం సీడ్​బాల్స్​ తయారీ మొదలుపెట్టా. ఈ కార్యక్రమానికి ప్రకృతి ప్రేమికుల నుంచి మద్దతు లభిస్తోంది. నాణ్యమైన విత్తనాలతో సీడ్ బాల్స్ తయారు చేయించడమే కాకుండా వాటి తయారీకి ముందుకు వస్తున్న వారికి శిక్షణ ఇప్పిస్తున్నాం కూడా. వర్షాకాలానికి మూడు నెలల ముందుగా సీడ్ బాల్స్ తయారు చేయాలి. వర్షాలు పడగానే ఆ బాల్స్​ను పంపిణీ చేసి, ఎంచుకున్న ప్రాంతాల్లో చల్లడం మొదలుపెడతాం. అందరి సహకారంతో గత ఎనిమిదేండ్లలో పది లక్షల సీడ్ బాల్స్ తయారుచేసి రాష్ట్రం అంతటా పంపిణీ చేశాం. ప్రకృతి నుంచి ఎంతో తీసుకుంటున్న మనం దాన్ని కాపాడేందుకు కొంతైనా ఇవ్వాలనేదే నా చిరు ప్రయత్నం.

- లక్కరసు ప్రభాకర వర్మ