చాలీచాలని విత్తనాలు .. ఉమ్మడి జిల్లాకు25 శాతం మేరకే విత్తనాభివృద్ధి సంస్థ సీడ్స్

చాలీచాలని విత్తనాలు .. ఉమ్మడి జిల్లాకు25 శాతం మేరకే విత్తనాభివృద్ధి సంస్థ సీడ్స్
  • విత్తనాల కోసం ప్రైవేట్​ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు

వనపర్తి, వెలుగు: వనపర్తిలోని విత్తనాభివృద్ధి సంస్థ నుంచి ఉమ్మడి మహబూబ్​నగర్  జిల్లా రైతులకు పూర్తి స్థాయిలో విత్తనాలు సప్లై చేయడం లేదు. -ఉమ్మడి జిల్లాలో వానకాలం సీజన్​లో ఏడు  లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేస్తుండగా, సంస్థ 1.60 లక్షల ఎకరాలకు మాత్రమే విత్తనాలు సప్లై చేయాలని నిర్ణయించింది. అవి ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే  రైతులు దుక్కులు దున్నుకుని విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి సంవత్సరం వానాకాలం, యాసంగి పంటలకు వనపర్తిలోని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఉమ్మడి జిల్లాలోని మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు విత్తనాలను సప్లై చేస్తుంది.

6 శాతం డిస్కౌంట్​తో.. 

విత్తనాభివృద్ధి సంస్థ నుంచి వరిలో సన్నరకాలైన ఆర్ఎన్ఆర్​-15048, బీపీటీ-5204, కేఎన్ఎం-1638తో పాటు జేజీఎల్​-27356, ఎంటీయూ-1224 వంటి కొత్త రకాలు అందుబాటులో ఉన్నాయి. గ్రామాల నుంచి రైతులు నేరుగా విత్తనాలు కొనుగోలు చేస్తే 6 శాతం డిస్కౌంట్​పై డెలివరీ చేస్తామని సంస్థ అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి వరి విత్తనాలే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పెసర, మినుము, కంది విత్తనాలు కూడా సరఫరా చేయనున్నారు. అవి కూడా ఒక్కో జిల్లాకు 5 నుంచి 30 క్వింటాళ్లకు మించి సరఫరా చేయడం లేదు. 

ప్రైవేట్​ వ్యాపారులే ఆధారం..

ఉమ్మడి జిల్లాలో ఐదు జిల్లాల్లో కలిపి వానా కాలంలో ఏడు లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయనున్నారు. వనపర్తి జిల్లాలోనూ 1.50 లక్షల ఎకరాల్లో వరి సాగు కానుంది. కేఎల్ఐ కాల్వలతో వర్షాకాలంలో భూగర్భ జలాలు వృద్ది చెందడం వలన జిల్లాలో వరి విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. మిగిలిన జిల్లాల్లో వర్షాధారంగా, పలు ప్రాజెక్టుల కింద వరి సాగు చేస్తున్నారు. 

గతంలో కంటే ఎక్కువ సప్లై..

2025 -వానాకాలంలో నిరుడు కంటే కొంత ఎక్కువగానే విత్తనాలు సరఫరా చేస్తున్నాం. పీఏసీఎస్, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, రైతు ఉత్పత్తి కేంద్రాలు, ఇతర డీలర్ల ద్వారా మండలాలకు సప్లై చేస్తాం. నిర్దేశిత లక్ష్యం మేరకే విత్తనాలను సరఫరా చేస్తున్నాం. డిమాండ్​ను బట్టి ప్రతిపాదనలు పంపుతాం.

ఆది నారాయణరెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ రీజినల్​ మేనేజర్, వనపర్తి

జిల్లాల వారీగా విత్తనాలు(క్వింటాళ్లలో)
జిల్లా    వరి    పెసలు    మినుములు    కంది      
మహబూబ్​నగర్    11,500    5    6    10
వనపర్తి    9,500    3    3    30
నాగర్​కర్నూలు    8,000    5    3    15
నారాయణపేట    6,500    2    4    05
జోగులాంబ గద్వాల    4,500    5    2    45