ఏపీలో ప్రజాశాంతి పార్టీకి, బీఆర్ఎస్ కు పెద్ద తేడా లేదు : సీదిరి అప్పలరాజు

తెలంగాణ మంత్రి హరీష్ రావు కామెంట్స్ పై ఏపీ మంత్రులు  సీరియస్ అయ్యారు. కేసీఆర్ ఫ్యామిలీపై మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.  టీఆర్ఎస్ ను బీఆర్ ఎస్ గా మారిస్తే జాతీయ పార్టీ అయిపోతుందా అని ప్రశ్నించారు.  మీలో ఏ కోశానైనా జాతీయవాదం ఉందా అంటూ ప్రశ్నించారు.

కేసీఆర్,హరీష్ అంతా ప్రాంతీయ ఉగ్రవాదులని  సీదిరి అప్పలరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో ప్రజాశాంతి పార్టీకి, బీఆర్ఎస్ కూ పెద్ద తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు.  ఆంధ్రవాళ్లు లేకుంటే తెలంగాణలో ఏమీ ఉండదన్నారు.  తెలంగాణ రాజకీయాలు ఏపీలో పనికిరావంటూ సీదిరి కామెంట్ చేశారు.  అటు బొత్స సత్యనారయణ కూడా హరీష్ రావు కామెంట్స్ పై స్పందించారు. ఏపీ గురించి మాట్లాడటానికి హరీష్ ఎవరని ప్రశ్ని్ంచారు. వాళ్ల రాష్ట్రాన్ని వాళ్లు చూసుకోవాలని చెప్పారు. ఏపీలో ఎలా పరిపాలిస్తున్నామో తమ ప్రజలకు తెలుసునని చెప్పారు. 

అంతకుముందు మంత్రి హరీష్  మాట్లాడుతూ..   తాను మాట్లాడిన మాటలకు ఓ ఏపీ మంత్రి ఎగెరెగిరి పడుతున్నారని అన్నారు. "మీ దగ్గర ఏమున్నది అని అంటున్నారు... మా దగ్గర ఉన్నవి చెప్పమంటే దునియా చెబుతాం.. మీ దగ్గర ఏమున్నాయి..?" అని ప్రశ్నించారు. ఆనాడు ప్రత్యేక హోదా కావాలని అన్నారని, ఇప్పుడేమో అడగరని చెప్పారు. అధికారంలో ఉన్న వాళ్ళు అడగరు... ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ప్రశ్నించరంటూ హరీష్ రావు ఆరోపించారు.

విశాఖ ఉక్కును తుక్కుకి అమ్మిన ఎవ్వరూ అడగరంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలను గాలికి వదిలేశారని, మీ ప్రయోజనాలు చూసుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష టీడీపీ.. రెండు పార్టీలు కలిసి ఏపీని ఆగం చేశాయని మంత్రి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.