సీలంపూర్ హత్య కేసు: లేడీడాన్ జిక్రతో సహాఏడుగురు అరెస్ట్.. నిందితుల్లో మైనర్

సీలంపూర్ హత్య కేసు: లేడీడాన్ జిక్రతో సహాఏడుగురు అరెస్ట్.. నిందితుల్లో మైనర్

ఢిల్లీలోని సీలంపూర్ దారుణ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితురాలు జిక్రా అలియాస్ లేడీ డాన్ సహా ఏడుగురుని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 17యేళ్ల కునాల్ అనే మైనర్ ను హత్య చేసిన కేసుతో సంబంధం ఉన్న అరెస్టులతోపాటు మరికొంతమంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. 

జిక్రా అలియాస్ లేడీ డాన్..10మంది మైనర్ల ముఠాను ఏర్పాటు చేసి వారితో ఆ ప్రాంతంలో భయాందోళనలు సృష్టించేది. ఆమె ఈ మైనర్ల ముఠాతో కలిసి పిస్టల్ వంటి ఆయుధాలు పట్టుకొని ఆ ప్రాంతంలో హల్ చల్  చేసేదని తెలుస్తోంది. కునాల్ హత్యకు ప్రణాళిక, అమలులో మైనర్ల పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

కునాల్ హత్య కు కారణం.. 

పోలీసు కస్టడీలో ఉన్న జిక్రా కునాల్ హత్య కేసులో కీలక విషయాలు బయటపెట్టింది. గత నవంబర్ లో కునాల్ అతని స్నేహితులు లాలా, శంభులు ఆమె బంధువులపై దాడి చేశారు. ఈ సంఘటన జరిగినప్పుడు కునాల్ అక్కడే ఉన్నా మైనర్ కావడంతో పోలీసులు అరెస్ట్ చేయలేదు.  అయితే జిక్రా బంధువులపై దాడిలో కునాల్ కూడా ఉన్నాడని అనుమానించి, మైనర్లతో నిఘా పెట్టింది. 

అతను ఆస్పత్రికి వెళ్తున్న సమయంలో  ఇద్దరు వ్యక్తులు దాడి చేసి కునాల్ ను కత్తులతో పొడిచారు.. ఘటన జరిగినప్పుడు జిక్రా సమీపంలోనే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.