సినిమాలో ఛాన్స్ .. రా ఏజెంట్‌గా సీమా హైదర్‌.. ఆడిషన్ కూడా ఇచ్చేసింది!

పాకిస్థాన్ నుంచి అక్రమంగా భారత్ లోకి ప్రవేశించిన  వివాహిత సీమా హైదర్ కు ఏకంగా సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. జానీ ఫైర్‌ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ బృందం మంగళవారం గ్రేటర్ నోయిడాలో సీమాను కలిసింది. రాజస్థాన్ ఉదయపూర్ లో ఇస్లామిక్ రాడికల్స్ చేతిలో హత్యకు గురైన టైలర్ కన్హయ్య లాల్‌పై తెరకెక్కుతోన్న  'ఎ టైలర్ మర్డర్ స్టోరీ' కోసం ఆమెను ఆడిషన్ చేసింది. 

చిత్ర దర్శకులు జయంత్ సిన్హా, భరత్ సింగ్ ఆమెను ఆడిషన్ తీసుకున్నారు.  ఈ చిత్రంలో రా ఆఫీసర్ పాత్రలో సీమా కనిపించనుందని సమాచారం. అయితే ఇందులో నటించేందుకు సీమా కండీషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) నుండి క్లీన్ చిట్ పొందిన తర్వాతే సినిమా ఆఫర్‌ను అంగీకరిస్తానని చెప్పింది.

ALSO READ:పుష్ప2 షూటింగ్కు బ్రేక్.. ఆలస్యం కానున్న ఐకాన్ స్టార్ మూవీ

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో 2022 జూన్ 28న ఇద్దరు వ్యక్తులు టైలర్ కన్హయ్య లాల్ ను(46 ) చంపేసిన సంగతి తెలిసిందే. ఉదయపూర్ లో అత్యంత రద్దీగా ఉండే ధన్ మండి మార్కెట్‌లో తన దుకాణంలో కన్హయ్య లాల్ ఉండగా, కస్టమర్లుగా వచ్చిన నిందితులు మహమ్మద్‌‌ రియాజ్‌‌ అన్సారీ, మహమ్మద్‌‌ ఘోష్‌‌.. కన్హయ్యను హత్య చేసి పారిపోయారు. ఈ ఘటన రాజస్థాన్‌ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.  

మరోవైపు ఉత్తరప్రదేశ్ కు చెందిన సచిన్ మీనా (22)తో తరచూ ఆన్ లైన్ లో పబ్జీ గేమ్ ఆడిన సీమా హైదర్.. అతనితో ప్రేమలో పడింది. తన నలుగురు పిల్లలను తీసుకుని ఇండియాకు వచ్చేసింది. ఈ క్రమంలో అక్రమంగా దేశంలోకి వచ్చినందుకు సీమాను, ఆమెకు ఆశ్రయం ఇచ్చినందుకు సచిన్ ను ఈ నెల 4న పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వాళ్లిద్దరికీ కోర్టు బెయిల్ ఇచ్చింది.