- కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: మంత్రి సీతక్క
- ఉపాధి హామీ పనులపై డీఆర్డీవోలకు దిశానిర్దేశం
హైదరాబాద్, వెలుగు: డిసెంబర్ మొదటి వారంలో ఇందిర మహిళా శక్తి పథకానికి సంబంధించి వారోత్సవాలు నిర్వహిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. సచివాలయంలో శనివారం డీఆర్డీవోలతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఉపాధి హామీ పథకంలో భాగంగా వచ్చే ఐదు నెలల్లో చేపట్టాల్సిన పనులపై జిల్లా అధికారులకు ఆమె దిశానిర్దేశం చేశారు. ప్రతి మహిళ.. స్వయంసహాయక సంఘాల్లో చేరేలా అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇప్పించేలా గ్రామగ్రామాన బ్యాంకర్లతో సదస్సులు నిర్వహించాలని పేర్కొన్నారు. ఉపాధి పథకం ద్వారా కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే పనులను చేపట్టాలన్నారు.
గడుపు నిర్దేశించుకుని పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మార్చి లోపు ఉపాధి హామీ పనుల కోసం రూ.1,372 కోట్ల నిధులు ఖర్చు చేస్తామని, అందుకు అనుగుణంగా డీఆర్డీవోలు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. మహిళలకు ఉపాధి భరోసా, పంట పొలాలకు బాటలు, పండ్ల తోటల పెంపకం, ఇంకుడు గుంతలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, స్వచ్ఛ భారత్ మిషన్ పనుల కోసం ఉపాధి నిధులు వెచ్చించేలా చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలు, అభివృద్ధి ప్రాతిపదికన పనులు గుర్తించా లన్నారు.
ప్రజల భాగస్వామ్యం పెంచేలా విధిగా గ్రామసభలు నిర్వహించాలని, గ్రామస్తుల అభిప్రాయాల మేరకు ఉపాధి పనులను చేపట్టాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి ఇంట్లో టాయిలెట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, పీఆర్, ఆర్డీ కమిషనర్ అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈవో దివ్య, స్పెష ల్ కమిషనర్ షఫి ఉల్లా పాల్గొన్నారు.