- సీఎం ఇంద్రవెల్లి పర్యటనను సక్సెస్చేయాలె
- ఫిబ్రవరి 2న నాగోబాను దర్శించుకుంటరు
- ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తరు
- స్మృతి వనానికి శంకుస్థాపన చేస్తరు
- అధికారులతో మంత్రి సీతక్క
గుడిహత్నూర్, వెలుగు : ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి , మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో సీఎం పర్యటన ఏర్పాట్లను బుధవారం ఖానాపూర్ ఎమ్యెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఐటీడీఏ పీఓ ఖుష్బూగుప్తాతో కలిసి పరిశీలించారు. అంతకుముందు నాగోబా ఆలయంలో పూజలు చేసి ఆవరణలో హెలిప్యాడ్‌ను పరిశీలించారు. అధికారులతో నిర్వహించిన రివ్యూలో మాట్లాడుతూ ఫిబ్రవరి 2న సీఎం ఇంద్రవెల్లితో పాటు నాగోబా ఆలయానికి వస్తున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు.
ఆలయంలో పూజలతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. స్టాల్స్ సందర్శించడంతో పాటు దర్బార్ హాల్‌లో అధికారులతో నిర్వహించనున్న సమావేశంలో పాల్గొంటారన్నారు. ఇంద్రవెల్లిలోని అమరుల స్తూపం వద్ద ఏర్పాటు చేయనున్న స్మృతి వనానికి శంకుస్థాపన చేసి, ప్రజా బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. తర్వాత మంత్రి సీతక్క ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఎస్పీ గౌస్ ఆలం, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ వికాస్ మహతో, కాంగ్రెస్ లీడర్లు డా.నరేశ్ జాదవ్, శేఖర్ పాల్గొన్నారు.
ఎవుసం తేలియనోళ్లకు, హైవే రోడ్లకూ రైతు బంధు ఇచ్చిన్రు
ఎవుసం తేలియనోళ్లకు , హైవే రోడ్లకూ బీఆర్ఎస్సర్కారు రైతుబంధు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఫిబ్రవరి 2న సీఎం పర్యటనను పురస్కరించుకుని ఆసిఫాబాద్‌లోని రోజ్ గార్డెన్ లో కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్పేరుతో తరలించి ఉమ్మడి జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టారన్నారు. పేదలకు ఇండ్లు కట్టియ్యని కేసీఆర్...అతడి కుటుంబం మాత్రం రాజభోగాలు అనుభవిస్తోందన్నారు. బీఆర్ఎస్ హయాంలో డాక్టర్లు ,రోడ్లు, అంగన్వాడీ సెంటర్లు, కనీస సౌకర్యాలు లేక ఆసిఫాబాద్ జిల్లా నిర్లక్ష్యానికి గురైందన్నారు.
అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ లీడర్లకు నిద్ర పట్టడం లేదన్నారు. కనీసం ఉద్యోగులకు కూడా సక్రమంగా జీతాలు ఇవ్వలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 5వ తేదీలోపే ఇస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే ఓర్వలేక ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారన్నారు. ఆర్టీసీ భూములను అమ్ముకున్నారన్నారు. నిరుద్యోగుల కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. స్వయానా ఎమ్మెల్యేనే అతడి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని జడ్పీ మీటింగ్ లో మాట్లాడారని ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి సభకు భారీగా తరలివచ్చి సక్సెస్ చేయాలని కోరారు. ఈసందర్భంగా జిల్లా కేంద్రంలో పని చేస్తున్న జర్నలిస్టులు తమకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని వినతిపత్రం ఇవ్వగా, స్పందించిన మంత్రి త్వరలో మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జీలు అజ్మీరా శ్యామ్ నాయక్, రావి శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు మసాదే చరణ్ పాల్గొన్నారు.