రెండు పంటలకు నీళ్లిచ్చేలా కృషి : సీతక్క

  • గత పాలకుల నిర్లక్ష్యంతో చెరువులకు అందని నీళ్లు
  • పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క
  • ములుగులోని రామప్ప పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌ నుంచి చెరువులకు నీటి విడుదల

ములుగు, వెలుగు : తలాపునే గోదావరి పారుతున్నా చుక్క నీరు కూడా అందకపోవడానికి గత పాలకులే కారణం అని పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క విమర్శించారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ హయాంలో ములుగు ప్రాంతంలోని రైతులకు రెండు పంటలకు సాగు నీళ్లు ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ములుగులోని రామప్ప పంప్‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌ నుంచి ములుగు మండలం జంగాలపల్లి, బంజరుపల్లి చెరువులకు ఆదివారం నీళ్లు విడుదల చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నిర్లక్ష్యం వల్లే ములుగు నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. జిల్లా నుంచి గోదావరి నది ప్రవహిస్తున్నా చుక్క నీటిని కూడా ఉపయోగించుకోలేని పాలన కొనసాగిందన్నారు. ఇక్కడి నీటిని ఇతర ప్రాంతాలకు తరలించి ఈ ప్రాంతానికి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రామప్ప రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌తో చుట్టుపక్కల సాగు చేసుకుంటున్న భూములకు నీళ్లు ఇవ్వలేదని, మునిగిన భూములకు పరిహారం కూడా ఇవ్వలేకపోయారన్నారు. రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌ నుంచి మిగిలిన మండలాలకు కూడా సాగునీరు అందించేలా చూస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ శాఖ ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

న్యూ ఇయర్‌‌‌‌‌‌‌‌ విషెస్‌‌‌‌‌‌‌‌ చెప్పిన సీతక్క

ములుగు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలకు మంత్రి సీతక్క న్యూ ఇయర్‌‌‌‌‌‌‌‌ విషెస్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. కొత్త ఏడాదిలో కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని, కుటుంబాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.