కేటీఆర్.. హెలికాప్టర్ పంపి కాపాడండి..: సీతక్క

కేటీఆర్.. హెలికాప్టర్ పంపి కాపాడండి..: సీతక్క
  • వరదల్లో చిక్కుకున్నోళ్లను పట్టించుకోవట్లేదంటూ సీతక్క కన్నీరు
  • ములుగు జిల్లాలోని వరద ప్రాంతాల్లో పర్యటన
  • కొండాయి గ్రామస్థులు ఆపదలో ఉన్నారని ఆవేదన

ములుగు, వెలుగు: ‘ములుగు ఏజెన్సీ ప్రాంతం జలదిగ్బంధంలో మునిగిపోయిందని పొద్దటి నుంచి ప్రాధేయపడుతున్న.. గ్రామాలన్నీ నీళ్ల మధ్యలో ఉన్నయి.. ప్రజల ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్న.. అయినా ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవడంతో ఆరుగురు గల్లంతయ్యారు’ అంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క కన్నీటిపర్యంతమయ్యారు. 

ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఏటూరునాగారం మండలంలో వరద బీభత్సం గ్రామాలను ముంచివేసింది. కొండాయి గ్రామానికి చెందిన ఆరుగురు వరదలో గల్లంతయినట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే సీతక్క సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఏటూరునాగారం వెళ్లారు. 

ALSO READ:జంపన్న వాగులో ఏడుగురు గల్లంతు.. నలుగురు మృతదేహాలు లభ్యం​

అక్కడ మీడియాతో మాట్లాడుతూ, ప్రజలను కాపాడండి అంటూ మొత్తుకున్నా కూడా ప్రభుత్వం స్పందించలేదని ఒక హెలికాప్టర్ ఉంటే ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడేవాళ్లమని ఆవేదన వ్యక్తం చేశారు. హెలికాప్టర్ కోసం తాను మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్ తదితరులకు ప్రయత్నాలు చేశానని అయినా కూడా పంపలేదని పేర్కొన్నారు. 

ప్రస్తుతం కొండాయి పరిసరాల్లోని 3 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయని, దాదాపు వందమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి హెలికాప్టర్ ద్వారా వారిని కాపాడాలని సీతక్క వేడుకున్నారు. ఆ గ్రామాలకు రెస్క్యూ టీమ్​లు కూడా వెళ్లలేకపోతున్నాయని, వెంటనే రక్షణ చర్యలను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.