పెద్దపల్లి: ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు అని.. గల్లీ ఎన్నికలు కావని మంత్రి సీతక్క అన్నారు. ఈగోలు పక్కన పెట్టి కలిసి కట్టుగా పని చేసి పెద్దపల్లి ఎంపీ సీటు రాహుల్ గాంధీకి గిఫ్ట్‌గా ఇవ్వాలని కార్యకర్తలకు మంత్రి దిశానిర్ధేశం చేసింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అధ్వర్యంలో నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వ కారణంగా పెద్ద ఎత్తున నిరుద్యోగిత పెరిగిందని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. బీటెక్, డిగ్రీలు చదివి వారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన NREGS పథకం ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్‌లో రాష్ట్రాన్ని ఇస్తే.. బీఆర్ఎస్ పార్టీ దాన్ని లూటీ చేసిందని అన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే పెద్దపల్లిలో గడ్డం వంశీ కృష్ణను గెలిపించాలని కోరింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే కేంద్రంలో ప్రజలకు మేలు జరిగే చట్టాలు వస్తాయని, అభివృద్ధి పనులు జరుగుతాయని సీతక్క వివరించారు.
అడవి బిడ్డలు అన్ని హక్కులు కల్పిస్తామని బీజేపీ మోసం చేసి అటవీ హక్కులను కేంద్రం కాలా రాస్తుందని, ఆదివాసి గుడాలను లేకుండా చేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. ఉక్కు పరిశ్రమను బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసి ఇప్పుడు సింగరేణి సంస్థను కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తుందని చెప్పారు. విదేశాలను నుంచి బొగ్గు దిగుమతి చేస్తుందని మంత్రి విమర్శించారు. అధానీ, అంబానీ లాంటి వ్యాపారవేత్తలకే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందన్నారు.