ములుగు, వెలుగు : తాను అసెంబ్లీలో అడిగితేనే ములుగు జిల్లా, మల్లంపల్లి మండలం, మెడికల్ కాలేజీ, ఏటూరునాగారం డివిజన్ అయిందని మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీతక్క చెప్పారు. అడగకుండా చేసిన పనులేంటో బీఆర్‌ఎస్ లీడర్లు చెప్పాలని సవాల్ చేశారు. ములుగు మండలం జంగాలపల్లిలో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీతక్క మాట్లాడారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ లీడర్లు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. అనంతరం యువజన సంఘాల జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కత్తెరపల్లి భాస్కర్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌లో చేరగా సీతక్క వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కూచన రవళిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లాడి రాంరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి చల్లా నారాయణ రెడ్డి, జడ్పీటీసీలు నామా కరంచంద్ గాంధీ, పుష్పలత, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, బానోతు రవిచందర్, వంగ రవి యాదవ్ పాల్గొన్నారు.