భద్రాద్రికొత్తగూడెం/మణుగూరు, వెలుగు: సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పబ్లిక్ హియరింగ్ నిర్వాసితులు, ప్రతిపక్షాల నిరసనల మధ్య గందరగోళంగా ముగిసింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద నిర్మించనున్న సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్‌పై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో బుధవారం అడిషనల్ కలెక్టర్ కె. వెంకటేశ్వరరావు పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. ప్రాజెక్ట్ కు పర్యావరణ అనుమతి లేదంటూ గతంలో పలువురు రైతులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు కంప్లైంట్ చేశారు. పనులు ఆపాలంటూ ఎన్జీటీ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.
ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ప్రాజెక్టు నిర్మించాలని ఎన్జీటీ సూచించడంతో పబ్లిక్ హియరింగ్ చేపట్టారు. అశ్వాపురం మండలానికి చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో అధికారులు సమావేశాన్ని నింపేశారు. హియరింగ్‌పై భూ నిర్వాసిత మండలాల రైతులకు సరైన సమాచారం ఇవ్వలేదంటూ పలువురు రైతులు అధికారులను నిలదీశారు. బీఆర్స్ పార్టీ మీటింగ్‌లా ఉందని, పబ్లిక్ హియరింగ్లా లేదని రైతులు అధికారులతో వాగ్వావాదానికి దిగారు. ఉద్రిక్తత ఏర్పడకుండా పోలీసులు ఇరువర్గాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అశ్వాపురం, మణుగూరు, పినపాక, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని దాదాపు 5 వేల ఎకరాల పంట పొలాలు ఈ ప్రాజెక్టు మూలంగా కోల్పోతున్నామన్నారు.
ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదన్నారు. నిర్వాసిత రైతులకు ఎకరాకు 10 లక్షల పరిహారం చెల్లిస్తామంటూ హామీ ఇచ్చిన అడిషనల్ కలెక్టర్ ఇప్పుడేమో రూ. 8 లక్షలు మాత్రమే చెల్లిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎకరాకు కనీసం రూ 30 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తమను భయభ్రాంతులకు గురిచేసి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. ఖమ్మం కలెక్టరేట్ బిల్డింగ్ నిర్మాణానికి భూమి ఇచ్చిన రైతులకు ఎకరాకు రూ. కోటి ఇచ్చారన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతులకు రూ.30 లక్షల పరిహారం చెల్లించడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారన్నారు.
ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్వహించే హైడల్ విద్యుత్ ప్రాజెక్టులో నిర్వాసితుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేక రాష్ట్ర ప్రభుత్వమే ఏకపక్ష నిర్ణయంతో నిర్మిస్తుందా అని పలువురు ప్రశ్నించారు. అనంతరం విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ సీతమ్మ సాగర్ బ్యారేజ్‌తో చర్ల నుంచి మణుగూరుకు గోదావరిపై బ్రిడ్జి వస్తోందన్నారు. దీంతో వాటి మధ్య దూరం తగ్గుతుందన్నారు.
కోకాపేట భూములకు కోట్లు మాకు ముష్టి ఎనిమిది లక్షలా..
రైతులు లేకుండానే అధికార పార్టీ లీడర్లతో సభ నిర్వహించి ఈ నాటకానికి ముగింపు పలకాలని అధికారులు నిర్ణయించారు. భూసేకరణ సమయంలో 1/70 చట్టం పేరుతో రైతులను బెదిరించి భూములు తీసుకున్న ప్రభుత్వ అధికారులు ఆ చట్టం ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారా చెప్పాల్సి ఉంది. రైతులకు రూ. 8 లక్షలు చెల్లించడం దారుణం. రైతులకు కనీసం ఎకరాకు రూ 30 లక్షలైనా చెల్లించాలి.
- కొమరం దామోదర్ రావు, సీతానగరం, దుమ్ముగూడెం
రీ డిజైన్ తో రైతులకు నష్టం...
రాజీవ్ సాగర్ ప్రాజెక్టును రీ డిజైన్ పేరుతో సీతమ్మసాగర్ ప్రాజెక్టుగా మార్చి రైతులకు తీరని నష్టం చేస్తున్నారు. ప్రభుత్వం తన అవసరానికి తగ్గట్టుగా చట్ట సవరణ చేస్తూ రైతులను మోసం చేస్తోంది. ప్రాజెక్టులో భూములు కోల్పోయే ప్రతి ఎకరాకు రూ 30 నుంచి రూ 40 లక్షలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
- కముజు మోహన్ రావు, మణుగూరు