సగంలోనే సీతమ్మసాగర్ .. 15 నెలలుగా నిలిచిన బ్యారేజీ, కరకట్టల పనులు

సగంలోనే సీతమ్మసాగర్ .. 15 నెలలుగా నిలిచిన బ్యారేజీ, కరకట్టల పనులు
  • వరదలొస్తే పరిస్థితి ఏంటి?
  • భయాందోళనలో స్థానికులు

భద్రాచలం, వెలుగు :  సీతమ్మసాగర్​ బ్యారేజీ పనులు నేషనల్ ​గ్రీన్​ ట్రిబ్యునల్​(ఎన్జీటీ) ఆదేశాలతో 15 నెలల కింద నిలిచిపోయాయి. బ్యారేజీతోపాటు  కరకట్టల పనులు సగంలోనే ఆగిపోయాయి. రూ.3481కోట్లతో 37.25 టీఎంసీల నీరు నిల్వ సామర్థ్యంతో భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కమ్మరిగూడెం వద్ద గోదావరిపై సీతమ్మసాగర్ ​బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. 1.50 కిలోమీటర్ల పొడవు, 70 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పుతో దీని నిర్మాణం చేపట్టారు. 65 గేట్లను ఏర్పాటు చేయనున్నారు. ఆరు బ్లాకులుగా నిర్మాణాలు మొదలయ్యాయి.

ఈ కట్టడం వల్ల నిలిచే నీటితో 320 మెగా వాట్ల విద్యుత్​ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా కమ్మరిగూడెం వద్ద నిర్మించాలనుకున్నారు. నాటి బీఆర్​ఎస్​ సర్కార్​ ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని తెల్లం నరేశ్​అనే వ్యక్తి చెన్నైలోని నేషనల్ గ్రీన్​ ట్రిబ్యునల్​లో 2023లో పిటిషన్​ దాఖలు చేశారు. కమిటీ విచారణ జరిపి 2023 మార్చి 24న పనులు నిలిపివేసింది.

వ్యతిరేకతకు కారణాలు.. 

  • బ్యారేజీ విద్యుత్​ ఉత్పత్తికి సహకరించేలా డిజైన్​ చేయలేదని సర్వేలు క్లియర్​గా రిపోర్టులు ప్రభుత్వానికి ఇచ్చారు. 

  •     వరదల సమయంలో బ్యారేజ్​ బ్యాక్​ వాటర్​తో అశ్వాపురంలోని హెవీవాటర్​ ప్లాంట్​ మునిగిపోతుందని, పలు గిరిజన గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని ఆందోళనలు చేపట్టారు. 
  •     సింగరేణి కోల్డ్ బెల్ట్​ ఏరియా కావడంతో భూకంపాల జోన్​లో ఉండటంతో ఎదురయ్యే ప్రమాదాలపై అధ్యయనం చేయకుండా నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. 
  •     బ్యాక్ వాటర్​ నుంచి గిరిజన ప్రాంతాలను కాపాడేందుకు కట్టే కరకట్టల కోసం 3,700 ఎకరాలకు పైగా భూమిని సేకరించాలి. ఏజెన్సీ కావడంతో కేవలం రూ.3.20లక్షలే ఇస్తామని ముందుగా చెప్పగా, నిర్వాసితుల ఆందోళనతో రూ.8లక్షలకు పెంచారు. కానీ తమకు ఎకరానికి రూ.30లక్షల పరిహారం కావాలంటూ పలువురు రైతులు ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టారు. అలాగే చర్ల మండలం కోరెగడ్డ భూములకు సంబంధించి పరిహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

వరదల భయం.. 

బ్యారేజీ నిర్మాణం, భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో ప్రారంభించిన కరకట్టలు సగంలోనే ఆగిపోవడంతో స్థానికులకు వరదల భయం పట్టుకుంది. ప్రధాన కాంట్రాక్టరు నుంచి సబ్​ కాంట్రాక్టు తీసుకున్న సంస్థలు కరకట్టల పనులు పూర్తిగా ఆపేసి మిషనరీ కూడా తీసుకెళ్లారు. వరదలు వస్తే ఇప్పుడు అవి ఎంత వరకు నిలుస్తాయనేదే పెద్ద ప్రశ్న. కట్టలు బీటలు వారి, గండ్లు పడి ఊళ్లలోకి వరద నీరు వచ్చే ప్రమాదం ఉంది. ఇష్యూ ఎన్జీటీ పరిధిలో ఉన్నందున పర్యావరణ అనుమతులు వచ్చాకనే తిరిగి పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

భయం వేస్తోంది

సీతమ్మసాగర్​ బ్యారేజీ పనులు సగంలో ఆగిపోవడంతో కరకట్టలు కూడా నిలిచిపోయాయి. సగం కట్టలు వరదలను ఎలా ఎదుర్కొంటాయి? అనేది అనుమానమే. ఊళ్లలోకి నీళ్లు వస్తాయేమోనని భయంగా ఉంది.  రైతులకు పరిహారం కూడా పూర్తిగా రాలేదు. 

ఎలమంచి వంశీకృష్ణ, రైతు, దుమ్ముగూడెం

పర్మిషన్​ కోసం ప్రయత్నిస్తున్నాం

పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎన్జీటీకి అవసరమైన ఫార్మాట్​లో పూర్తి వివరాలు ఇస్తున్నాం. త్వరలోనే అనుమతులు వస్తాయి. 

రాంబాబు, డీఈ, సీతమ్మసాగర్​