
భద్రాచలం సీతారామస్వామి కొలువైన భద్రాద్రి క్షేత్రం. భద్రాద్రి సీతారామ స్వామి వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఇవాళ్టి నుంచి (ఏప్రిల్ 10) అంకురార్పణతో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. భద్రాద్రి రామయ్య కళ్యాణోత్సవాన్ని ఏప్రిల్ 14 వ తేదీన నిర్వహించడానికి ముహూర్తం ఖరారైంది. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరగనుంది. పావన క్షేత్రమైన భద్రాచల సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 6 నుండి 20వ తేదీ వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు భద్రాద్రి దేవాదాయ శాఖ అధికారులు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. సీతా రాములవారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా భద్రాచలంలోని స్వామి వారి దేవస్థానం లో బుధవారం నుండి నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉత్సవ అంకురార్పణతో ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. ఇవాళ ప్రత్యేక తీర్థ బిందెను గోదావరి నుంచి తీసుకొచ్చే అంకురార్పణ చేస్తారు. 11న ధ్వజ పట మండల లేఖనం చేస్తారు. 12న ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 13న ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా జరుగుతుంది. 14న సీతారామ స్వామి వారి కళ్యాణం మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక 15వ తేదీన శ్రీరామ మహా పట్టాభిషేకాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించనున్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు స్వామి వారి కల్యాణ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.