జూలై 9 నుంచి సీత్లా భవాని పండుగ

జూలై 9 నుంచి సీత్లా భవాని పండుగ

గిరిజనులు ఏటా పెద్ద పుశాల కార్తెలో నిర్వహించే సీత్లా భవాని (దాటుడు) పండగ ఈనెల 9 నుంచి ప్రారంభం కానుంది. 15 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు తండావాసులు సిద్ధం అవుతున్నారు. పశుసంపద బాగుండాలని , సకాలంలో చెరువులు, కుంటలు నిండి సమృద్ధిగా పంటలు పండాలని దేవతలను ఆరాధిస్తూ వేడుకలు జరుపుతారు. 

ఈ పండుగను తమ తొలి పండుగగా లంబాడీలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ నెల 9న తమ పశువుల అలంకరించి, దైవంగా కొలుస్తారు. ఏడుగురు దేవతలు మేరమ్మ, తుల్జా, సీత్లా, మంత్రాల్​, ద్వాల్​అంగల్​, కంకాళి, హింగ్ల, మాతలను పూజిస్తారు. నైవేద్యంగా బియ్యంలో బెల్లం వేసి ఉడికించి పాయం చేస్తారు. జొన్నలు. మొక్క జొన్నలతో గుగ్గిళ్లు తయారు చేసి వాటిలో యాట రక్తంను కలుపుతారు, యాట పేగులను వేలాడ కట్టి వాటి కింది నుంచి పశువులను పంపుతూ కోడిని కోసి పశువుల పై నుంచి విసిరి వేయడం ద్వారా పశువులు సురక్షితంగా ఉంటాయానేది గిరిజనుల నమ్మకం.         - మహబూబాబాద్​, వెలుగు