ఒడిశా రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 290 మంది మృత్యువాత పడగా, వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషాదకర ఘటనలో అయినవారిని, ఆత్మీయులను కోల్పోయిన కోల్పయిన వారి వేదన వర్ణనాతీతంగా మారింది. ఈ పరిస్థితులలో కన్నవాళ్లను కోల్పోయిన పిల్లలను చదవించేందుకు టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ ముందుకొచ్చారు. తాను నడుపుతున్న స్కూల్లో ఆ పిల్లలందరిని ఉచితంగా చదివిస్తానని సెహ్వాగ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
'ఒడిశా రైలు ప్రమాద ఘటన నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. ఈ విషాద సమయంలో నేను చేయగలిగిన అతి చిన్న సాయం ఏంటంటే.. ఈ ప్రమాదంలో కన్నవాళ్లను కోల్పోయిన అనాథ పిల్లలను ఉచితంగా చదివించడమే. వాళ్లకు సెహ్వాగ్ ఇంటర్నేషన్ స్కూళ్లలో చదువుతో పాటు ఉచిత వసతి సౌకర్యం కూడా కల్పిస్తాను..' అని సెహ్వాగ్ ట్వీట్ చేశారు.
కాగా, ఒడిశాలోని బాలాసోర్ వద్ద శుక్రవారం రాత్రి మూడు రైళ్లు ఢీ కొనడంతో భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.మొదట కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లూప్ లైన్‌లోకి వెళ్లి ఆగి ఉన్నగూడ్స్ రైలుని ఢీ కొట్టింది. ఆ తర్వాత పక్కనుంచి వెళ్తున్న యశ్వంతపూర్-ఔరా ఎక్స్‌ప్రెస్.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీ కొట్టింది. ఈ ప్రమాద ఘటనపై రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ సీబీఐ విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదం వెనక ఉగ్రకుట్ర ఉందని ప్రతిపక్షాలు విమర్శించడం, ఇద్దరు రైల్వే అధికారుల ఫోన్‌కాల్ సంభాషణ నెట్టింట వైరల్ అవ్వడంతో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు ఈ కేసును సీబీఐకి అప్పగిచింది.