జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతీ బ్యారేజీలో సెస్మిక్ పరీక్షలకు వర్షం కారణంగా తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో నిపుణులు బ్యారేజ్ టెస్టులు నిలిపివేశారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. గత రెండు రోజుల నుండి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, ప్రాణహిత నదులలోకి వరద నీరు చేరి ప్రవహిస్తుంది.
ALSO READ | పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల కాంట్రాక్టర్లూ రావాలని ఆదేశాలు : మంత్రి ఉత్తమ్
దీంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 49వేల 500 క్యుసెక్కుల వరద వస్తుండగా బ్యారేజ్ లోని 85 గేట్లన్ని పూర్తిగా ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఇరిగేషన్ అధికారులు దిగువకు తరలిస్తున్నారు. ఎగువన ఉన్న కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదుల నీటిమట్టం 5.40 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. మానేరు నుంచి 4 వేల క్యూసెక్కుల వరద రావడంతో పనులకు ఆటంకం కలిగింది. బ్యారేజీకి ఎగువ, దిగువన 44 జియో ఫిజికల్, సెస్మిక్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, మరో 9 పరీక్షలు పెండింగ్లో ఉన్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.
ALSO READ | తెలంగాణ, ఏపీకి .. నేటి నుంచి నీటి విడుదల : కేఆర్ఎంబీ