వడ్లకు ఎంఎస్పీ ఇవ్వని..మిల్లులను సీజ్ చేయండి : మంత్రి కోమటిరెడ్డి

మిర్యాలగూడ, వెలుగు : యాసంగి వడ్లకు కొర్రీలు పెడ్తూ తక్కువ ధరకు కొంటున్న రైస్ మిల్లులను సీజ్ చేయాలని సివిల్ సప్లైస్ అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. కనీస మద్దతు ధర ఇవ్వని వ్యాపారులపై కేసులు నమోదు చేయాలన్నారు. బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని గూడూరులో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. వేముపల్లి మండలం శెట్టిపాలెం వద్ద మహర్షి రైస్ మిల్లు వద్ద వడ్ల బస్తాలతో పడిగాపులు కాస్తున్న రైతులతో ఆయన మాట్లాడారు. 

నిన్న మొన్నటిదాకా క్వింటాల్ వడ్లకు మిల్లర్లు రూ.2,500 ఇచ్చారని, ఇప్పుడు రూ.1,950 నుంచి రూ.2,300 ఇస్తున్నారని రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కనీస మద్దతు ధర గురించి అడిగితే.. ఇష్టముంటే అమ్మండి.. లేకుంటే వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని చెప్పారు. దీనిపై స్పందించిన మంత్రి.. అక్కడి నుంచే డీఎస్​వో వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్​తో ఫోన్​లో మాట్లాడారు. కనీస మద్దతు ధర ఇవ్వని మహర్షి రైస్ మిల్లుపై కేసు పెట్టాలని ఇదివరకే చెప్పినా ఎందుకు చర్యలు తీసుకోలేదని సివిల్ సప్లైస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మిల్లర్ల బెదిరింపుల విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. క్వింటాల్ వడ్లు రూ.3వేలకు కొనాలని, అంతకంటే తక్కువకు కొంటున్న మిల్లులను సీజ్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. తమది ప్రజా ప్రభుత్వమని, రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. అవసరమైతే ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.