అలంపూర్ సరిహద్దులో.. 3,442 మద్యం బాటిళ్లు పట్టివేత

అలంపూర్ సరిహద్దులో..  3,442 మద్యం బాటిళ్లు పట్టివేత

కర్నూలు: అలంపూర్ సరిహద్దులో భారీ ఎత్తున మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. రెండు కార్లలో 3 వేల 442 మద్యం బాటిళ్లను జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దు దాటి కర్నూలు జిల్లాలో ప్రవేశించారు. ఇక్కడ నుండి కడప జిల్లాకు తరలించే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఏపీ కంటే తెలంగాణలో మద్యం ధరలు సగానికిపైగా తక్కువగా ఉండడంతో భారీ ఎత్తున అక్రమ రవాణా జరుగుతోంది. పట్టుబడిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతోపాటు.. 16 ఏళ్లు  జైలు శిక్ష విధించేలా చేస్తామని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నా అక్రమార్కులు పట్టించుకోవడం లేదు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ర్టాల పోలీసులు పెద్ద ఎత్తున చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నా.. మద్యం అక్రమ రవాణా దారులు.. వారి కళ్లు కప్పి చెక్ పోస్టులు దాటేస్తున్నారు.

కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు  స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ గౌతమి శాలి రహస్యంగా అందుతున్న సమాచారం అందితే.. ఆకస్మిక తనిఖీలు చేసి హడలెత్తిస్తున్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు.. కనీసం పేర్లు కూడా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో దాడి చేసిన ప్రతిసారి అక్రమార్కుల గుట్టు రట్టు అవుతూనే ఉంది. తెలంగాణ నుండి వివిధ బ్రాండ్లకు చెందిన 364 లీటర్లకు పైగా మద్యం ఇవాళ ఒకే రోజు పట్టుపడడం ఇది రెండోసారి. ఎక్కడైనా అక్రమ మద్యం, ఇసుక రవాణా జరుగుతుంటే.. ఫోటోలు.. వీడియోలను తమ నెంబర్: 7993822444 కు తెలియజేయాలని.. కోరారు. ఇప్పటి వరకు సమాచారం అందించిన వారి వివరాలన్నీ గోప్యంగా ఉంచడం వల్ల మంచి స్పందన వస్తోందని పోలీసులు చెబుతున్నారు.  ప్రతి రోజు డజన్ల సంఖ్యలో నమోదవుతున్న కేసులే దీనికి నిదర్శనమని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.